హాంగ్‌కాంగ్... నిరసనలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతున్న దేశం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంతటి ఉద్రిక్తతలకు కారణం... ఓ బిల్లు. నిరసనలకు ముగింపు పలకడానికి ఎట్టకేలకు హాంగ్‌కాంగ్ ప్రభుత్వం దిగొచ్చింది. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన వివాదాస్పద బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
ఏమిటీ బిల్లు...
నేరాలకు పాల్పడ్డ తమ దేశస్థులను విచారణ నిమిత్తం అవసరమైతే చైనాకు అప్పగించేందుకు వీలుగా హాంగ్‌కాంగ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావాలని యోచించింది. దీనికి వ్యతిరేకంగా దేశవాసులు ఉద్యమించారు. నిరసనలతో హాంగ్‌కాంగ్ వీధులు హోరెత్తాయి. బిల్లుకు ఆమోదం లభిస్తే చైనా న్యాయ వ్యవస్థతో హంగ్కాంగ్కు ముప్పు పొంచి ఉంటుందని ఆరోపించారు ఉద్యమకారులు. నిరసనల ఫలితంగా దేశం రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది.