పాకిస్థాన్ సైన్యం తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి డుజార్రిక్. కరోనా వైరస్‌తో ప్రపంచం గడగడలాడుతున్న తరుణంలో కాల్పుల విరమణ పాటించాలని ఆంటోనియో గుటెరస్ ఇచ్చిన పిలుపునకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
"ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి కోరారు. అది అందరికి వర్తిస్తుంది. అందరూ గుటెరిస్ విజ్ఞప్తికి కట్టుబడి ఉండాలి."
-- డుజార్రిక్, గుటెరస్ ప్రతినిధి.
గురువారం జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా వద్ద ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. ఈ ఘటనలో ఓ భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్థాన్ చర్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ సైన్యం.. మంగళవారం కూడా పూంచ్ జిల్లాలోని కస్బా, కిర్ని, షాపుర్, మన్కోట్ సెక్టర్లపై దాడి చేసిందని అధికారులు తెలిపారు.
భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. అప్పటి నుంచి పాకిస్థాన్ వైపు నుంచి కాల్పుల ఘటనలు పెరిగాయి.
ఇదీ చూడండి:-పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు భారత జవాన్లు మృతి