సెర్చింజన్లోని వార్తలకు డబ్బు చెల్లించాలన్న చట్టం అమలు చేస్తే ఆస్ట్రేలియాలో తమ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని గూగుల్ ప్రభుత్వాన్ని శుక్రవారం హెచ్చరించింది. బిల్లుపై సెనేట్ విచారణలో భాగంగా గూగుల్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ మెల్ సిల్వా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు వల్ల తమతో పాటు ప్రజలు, మీడియా, చిరు వ్యాపారాలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ ఘాటుగా స్పందించారు. తాము బెదిరింపులకు భయపడమని వ్యాఖ్యానించారు.
ఈ తరహా చట్టం అమలు అయితే మాకు ఆస్ట్రేలియాలో గూగుల్ సేవలు నిలిపివేయడం తప్ప మరో గత్యంతరం లేదు. వార్తా సంస్థలకు డబ్బు చెల్లించేందుకు మేము సిద్ధం. కానీ ఈ చట్టంలో పేర్కొన్న విధంగా కాదు. పక్షపాతంగా ఉన్న ఈ నియమాలు మా సంస్థకు ఆర్థికంగా, వ్యవహారికంగా ఇబ్బందులకు గురిచేస్తాయి.
-మెల్ సిల్వా, గూగుల్ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) మేనేజింగ్ డైరెక్టర్
మేము బెదిరింపులకు భయపడం. ఆస్ట్రేలియాలో నడుచుకునే విధంగానే ప్రభుత్వం నిబంధనలను రూపొందిస్తుంది. అదే మా ప్రభుత్వం చేసింది.