భారత్- పాకిస్థాన్... దాయాది దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత ఉద్రిక్తత ఉంటుంది. అయితే భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతుంటే.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అన్నింటిలోనూ వెనకపడే ఉంటోంది. కరోనా వైరస్ రూపంలో ఈ విషయం మరోమారు నిరూపితమైంది. ఆఖరికి చైనాలో ఉన్న పాకిస్థాన్ విద్యార్థులు సైతం.. భారత్‌ను చూసి నేర్చుకోండి అంటూ తమ ప్రభుత్వంపై మండిపడే పరిస్థితి నెలకొంది.
'మా వల్ల కాదు...'
చైనాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకు 425 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌లోని తమ పౌరులను వెనక్కి రప్పించుకోవడానికి ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాయి. భారత్ ఇప్పటికే 654మందిని వెనక్కి తీసుకొచ్చింది. కానీ పాకిస్థాన్ మాత్రం.. వైరస్‌ను ఎదుర్కునేందుకు తమ వద్ద సరైన వైద్య సదుపాయాలు లేవని... తమ వల్ల కాదని చేతులెత్తేసింది. పాకిస్థాన్ పౌరులను చైనాలోనే ఉంచేందుకూ సిద్ధపడింది.
తమను స్వదేశానికి తీసుకెళ్లాలని అనేకమార్లు పాక్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు విద్యార్థులు. అయినా ఇమ్రాన్‌ఖాన్ సర్కారులో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.