కరోనా వైరస్‌పై చైనా చాలా విషయాలను దాచిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అనేకమార్లు ఆరోపించారు. తాజాగా వీటికి ఊతమందిస్తూ.. అగ్రరాజ్య హోంల్యాండ్ భద్రతా విభాగం(డీహెచ్ఎస్) ఓ నివేదికను రూపొందించింది. మహమ్మారిని కట్టడి చేయడానికి సరిపడా మందులను పోగుచేయడం కోసమే వైరస్ విజృంభణ, దాని తీవ్రతను చైనా కప్పిపుచ్చిందని పేర్కొంది.
"ఓవైపు వైరస్ తీవ్రతను తక్కువ చేసి చూపిస్తూనే.. మరోవైపు ఔషధాల దిగుమతులు పెంచింది చైనా. ఎగుమతులను తగ్గించింది. ఈ విషయం బయటకు రాకుండా.. ఎగుమతులపై ఆంక్షలు ఉన్నాయని, డేటాలో లోపాలున్నాయని కప్పిపుచ్చింది."
--- హోంల్యాండ్ భద్రతా విభాగం
వైరస్ ఇతరులకు సంక్రమిస్తుందనే విషయం.. జనవరి చివరి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చైనా చెప్పలేదని పేర్కొంది డీహెచ్ఎస్. ఔషధాల దిగుమతే ఇందుకు కారణమని నివేదికలో వెల్లడించింది. ఫేస్ మాస్కులు, సర్జికల్ గౌన్లు, గ్లవ్స్ దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపింది.
వైరస్ తీవ్రతను చైనా నేతలు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని మే 1న ఈ నాలుగు పేజీల రిపోర్టు రూపొందించింది. వైరస్‌ను నియంత్రించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నివేదిక బయటకు రావడం గమనార్హం.
అయితే మందుల కోసమే చైనా అసలు నిజాన్ని దాచిపెట్టింది అని అనడానికి సరైన ఆధారాలు లేవు.
ఇదీ చూడండి:-'ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అమెరికా సిద్ధం'