దక్షిణ కొరియా.. కరోనా వల్ల చైనా తర్వాత అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో ఒకటి. దేశవ్యాప్తంగా 7,755 మంది వైరస్ బారిన పడ్డారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాలుగో స్థానంలో ఉంది. కానీ.. మరణాల సంఖ్య 60 మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సగటు మరణాలకన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్ కట్టడికి దక్షిణ కొరియా తీసుకున్న చర్యలేంటి? ఆ దేశం అమలు చేసిన వ్యూహాన్ని ఓ పాఠంగా పరిగణించవచ్చా?
వైరస్ను దక్షిణ కొరియా ఎలా కట్టడి చేస్తోంది?
చైనాలా వైరస్ ప్రభావిత నగరాలను మూసివేయడానికి బదులుగా.. దక్షిణ కొరియా బహిరంగంగా సమాచారం అందించటం, ప్రజలను భాగస్వాములను చేయటం, విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టింది. కరోనా బారిన పడిన ప్రతి ఒక్క రోగి ఎవరిని కలుస్తున్నారో తెలుసుకుంటూ.. వారికి పరీక్షలు నిర్వహిస్తోంది.
వైరస్ బాధితులను 14 రోజుల పాటు వారు చేసే పనుల ద్వారా పరిశీలన చేస్తున్నారు అధికారులు. అందులో క్రెడిట్ కార్డుల వాడకం, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ ట్రాకింగ్ వంటివి ఉన్నాయి. ఆ సమాచారం ఎప్పటికప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లలో పెడుతున్నారు. కొత్త కేసు వచ్చిన ప్రాంతాలకు సంక్షిప్త సందేశం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 134 అమెరికన్ డాలర్లు ఖర్చు అయ్యే పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టే చర్యలతో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదమున్నా... ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదు. పరీక్షలు చేయించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తద్వారా వైరస్ను త్వరగా గుర్తించి.. వ్యాప్తిని అరికట్టగలుగుతున్నామని చెబుతున్నారు అధికారులు.
అంతమందికి పరీక్షలు ఎలా?
ఇతర దేశాలతో పోల్చితే వేగంగా పరీక్షలు జరిపిస్తోంది దక్షిణ కొరియా. ప్రతి రోజు 15 వేలకుపైగా నమూనాలను పరీక్షిస్తోంది. ఇప్పటి వరకు 2,20,000 మందికి పరీక్షలు చేపట్టారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 500కుపైగా ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు.
2015లో వ్యాప్తి చెందిన మెర్స్ (ఎమ్ఈఆర్ఎస్) వైరస్ సమయంలో పరీక్ష కిట్లు లేక దక్షిణ కొరియా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. నాడు నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు పక్కాగా అమలు చేస్తోంది. కేవలం 6 గంటల్లోనే ఫలితాలను వెల్లడించే కోవిడ్-19 పరీక్ష కిట్లు సమకూర్చుకుంది. వాటిని దేశంలోని అన్ని ప్రయోగ కేంద్రాలకు పంపిణీ చేసింది.