తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​ అంశంపై 'డ్రాగన్​' అదే మొండిపట్టు..! - UN Security Council Consultations Room.

కశ్మీర్​ అంశాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లేవనెత్తడానికి.. చైనా విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు భంగపాటు ఎదురైనా అదే మొండివైఖరి ప్రదర్శిస్తోంది. తాజాగా బీజింగ్​ చర్యను భారత్​ తప్పుబట్టిన నేపథ్యంలో.. తమ వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది డ్రాగన్​ దేశం. భద్రతా మండలిలో మెజారిటీ సభ్యులు.. కశ్మీర్​ పరిస్థితులపై ఆందోళనగా ఉన్నట్లు ఆరోపిస్తోంది.

china-defends-raising-kashmir-issue-at-unsc-to-de-escalate-indo-pak-tensions
కశ్మీర్​ అంశంపై 'డ్రాగన్​' అదే మొండిపట్టు..!

By

Published : Jan 18, 2020, 5:26 AM IST

ప్రతి విషయంలోనూ పాకిస్థాన్​కు వంత పాడే చైనా... ఆర్టికల్​ 370 రద్దు తర్వాత కశ్మీర్​ను అడ్డంపెట్టుకుని భారత్​ను ఇబ్బంది పెట్టేందుకు వరుస ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 2 రోజుల క్రితం కూడా.. ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తాలని ప్రయత్నించిన పాక్​, చైనాకు భంగపాటు తప్పలేదు. ఈ అంశంలో బీజింగ్​ చర్యను భారత్​ తప్పుబట్టగా... తమ వ్యాఖ్యలపై అదే మొండిపట్టు ప్రదర్శిస్తోంది డ్రాగన్​ దేశం.

భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఐరాస భద్రతా మండలిలో చర్చ జరగాలని ఉద్ఘాటించింది. మండలిలోని మెజారిటీ సభ్యులు... కశ్మీర్​ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు చైనా ఆరోపిస్తోంది.

''కశ్మీర్​ విషయంలో చైనా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. పాకిస్థాన్​ అభ్యర్థన మేరకు జనవరి 15న కశ్మీర్ విషయాన్ని భద్రత మండలి సమీక్షించింది. అక్కడి పరిస్థితులపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. చర్చల ద్వారా శాంతియుతంగా సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి కృషి చేయాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.''

-జెంగ్ షువాంగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

చైనా, పాక్​కు​ భంగపాటు...

జనవరి 15న కశ్మీర్​ అంశంపై భద్రతా మండలి రహస్య సమావేశంలో చర్చించాలని డ్రాగన్​ డిమాండ్ చేయగా.. మిగతా దేశాలు తిరస్కరించాయి. కశ్మీర్​ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితబోధ చేశాయి. అనంతరం.. బీజింగ్​ చర్యను తప్పుబట్టింది భారత్​. మరోసారి కశ్మీర్​ అంశంతో భారత్​ను ఇబ్బందిపెట్టేందుకు డ్రాగన్​ దేశం విఫలయత్నం చేసిందని విమర్శించింది.

ఇదీ చూడండి: పౌర ఆందోళనల్లోనూ విదేశీ పర్యటకుల తాకిడి

ABOUT THE AUTHOR

...view details