తెలంగాణ

telangana

ETV Bharat / international

10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి.. ఎలా?

చైనాను గడగడలాడిస్తున్న కరోనా వైరస్​ కోసం 10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది జిన్​పింగ్ ప్రభుత్వం. నేడు సేవలను ప్రారంభిస్తున్న ఈ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు మొదటి దఫాలో వ్యాధి పీడితులు చేరుకున్నారు. 1500 పడకల సామర్థ్యమున్న మరో ఆసుపత్రిని ఈ వారమే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు ప్రస్తుతం తుదిదశలో ఉన్నాయి.

china
10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి.. ఎలా సాధ్యమైందంటే..!

By

Published : Feb 3, 2020, 11:15 AM IST

Updated : Feb 28, 2020, 11:49 PM IST

10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి.. ఎలా?

కరోనా వైరస్.. 20కి పైగా దేశాలకు వ్యాపించిన ప్రపంచవ్యాప్త మహమ్మారి. ఇప్పటి వరకు చైనాలో ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి 361 మంది అసువులు బాశారు. మరో 17000కి పైగా జనం ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ ఇప్పుడు చైనాలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. దీని కట్టడికి ఆ దేశం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కేవలం 10 రోజుల వ్యవధిలో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఈ ఆసుపత్రి నిర్మాణం వెనకున్న విశేషాలు.

వుహాన్‌ శివారులో...

చైనాలో వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్‌ నగర జనాభా 1.1 కోట్లు. ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో అత్యధికం ఇక్కడే. రోజుకు పదుల సంఖ్యలో మృత్యు ఒడికి చేరుతున్నారు. అందుకే ముందు ఈ నగరంలో వైరస్‌ని కట్టడి చేయాలని సంకల్పించారు అధికారులు. కరోనా బాధితులకు సాధారణ ఆస్పత్రుల్లో వైద్యం చేస్తే ఇతరులకూ వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. వుహాన్‌ నగర శివారులో 'హువుశెన్షన్ హాస్పిటల్‌' పేరిట దీన్ని నిర్మించారు. నేటి నుంచి రోగులకు ఇక్కడ చికిత్స అందజేయనున్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతల్ని చేపట్టింది.

ఎలా నిర్మించారంటే...

ఒక చిన్న ఇంటిని నిర్మించాలంటేనే కనీసం రెండు మూడు నెలలు పడుతుంది. కానీ, చైనా మాత్రం 1000 పడకల ఆసుపత్రిని కేవలం పది రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించింది. భారీ నిర్మాణ, మౌలికవసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రావీణ్యం ఉన్న చైనా.. ఆపద సమయంలో తన అనుభవాన్ని వినియోగించి ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది. అత్యధిక జనాభా కలిగిన చైనా.. విపత్తుల సమయంలో తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 'ప్రీ ఫాబ్రికేటెడ్‌ కాంక్రీట్‌ బ్లాక్స్‌'ని సిద్ధంగా ఉంచుతుంది. వీటన్నింటినీ ఒకచోటికి చేర్చి నిర్మాణం పూర్తి చేస్తారు. అంటే విడిభాగాలన్నింటినీ అనుసంధానం చేసి వాహనాన్ని రూపొదించినట్లే ఇళ్లను కూడా నిర్మిస్తారు. తాజాగా ఆస్పత్రి నిర్మాణంలోనూ ఇదే విధానాన్ని వినియోగించారు. ఇక దీంట్లో ఆర్మీ భాగస్వామ్యం ఉండడం వల్ల పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి.

419 వార్డులు...

దేశవ్యాప్తంగా ఉన్న అనుభవజ్ఞులైన ఇంజినీర్లందరినీ ఒక్కచోటికి చేర్చిన చైనా వారందరినీ ఈ ప్రాజెక్టులో భాగం చేసింది. మొత్తం 7000 మంది కార్మికులు నిరంతరం దీని నిర్మాణంలో పాల్గొన్నారు. 1000కి పైగా భారీ యంత్రాలు పనిచేశాయి. దీంతో 2,69,000 చదరపు అడుగుల స్థలంలో ఆసుపత్రి సిద్ధమయింది. దీనిలో మొత్తం 30 ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లు (ఐసీయూ) సహా 419 వార్డులు ఉన్నాయి. మొత్తం 1400 మంది వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.

తుదిదశ నిర్మాణంలో ఉన్న మరో 1500 పడకల ఆసుపత్రిని ఈ వారమే ప్రారంభించనుంది చైనా.

గతంలోనూ...

గతంలో సార్స్‌ వైరస్‌ వ్యాపించినప్పుడు కూడా చైనా ఈ తరహాలోనే చర్యలు చేపట్టింది. అప్పుడు బీజింగ్‌ శివారులో ఏడు రోజుల్లో ఆసుపత్రి నిర్మించింది. మొత్తం 4000 మంది కార్మికులు 24X7 దీని నిర్మాణంలో పాల్గొన్నారు. రెండు నెలల్లో దేశంలో దాదాపు ఏడో వంతు మంది బాధితులు ఇక్కడే చికిత్స పొందారు. అయితే దీని నిర్మాణం తర్వాత ఆ రాష్ట్ర ఉద్యోగులు, ప్రజలకిచ్చే సబ్సిడీల్లో కోత విధించిందన్న విమర్శలు ఉన్నాయి.

తాజాగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చైనా చేపడుతున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా సహా ఇతర దేశాలు కొనియాడుతున్నాయి. వైరస్‌కు మందు కనుగొనేందుకు అనేక పరిశోధన సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాలో వైద్య పరిశోధకులు దీని టీకా తయారీలో పురోగతి సాధించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: కరోనా కల్లోలం​: చైనాలో 361కి చేరిన మృతుల సంఖ్య

Last Updated : Feb 28, 2020, 11:49 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details