కరోనాపై ఫైట్ కోసం కొత్త వైరస్- ఆసీస్ శాస్త్రవేత్తల ఘనత కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోంది. అంతకంతకూ విస్తరిస్తోన్న ఈ వైరస్ ధాటికి ఇప్పటివరకు చైనాలో 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది వైరస్ ప్రభావానికి లోనయ్యారు. చైనాలో బయటపడి క్రమంగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా సహా 16 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ వ్యాప్తికి కారణాలు, నివారణ పద్ధతులు తెలియక వైద్యులు తలలపట్టుకుంటున్నారు.
అయితే.. కరోనా వైరస్ విషయంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. వైరస్ విరుగుడుకు ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స అందుబాటులో లేని ప్రస్తుత తరుణంలో.. కరోనా పరిణామ క్రమాన్ని, వ్యాధి నిర్ధరణ విధానాన్ని కనుగొన్నట్లు ప్రకటించారు.
ఈ చికిత్స విధానం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నివేదించనున్నారు. వైరస్ నిర్ధరణ, చికిత్స విధానం కోసం చేసే ప్రయత్నాలకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల కృషి సహకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
రోగి నమూనా నుంచి కృత్రిమ సృష్టి..
ప్రయోగశాలలో రోగి నమూనా నుంచి కృత్రిమ వైరస్ను సృష్టించి దాని జన్యు శ్రేణిని వర్గీకరించారు పీటర్ డోహర్టీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీకి చెందిన పరిశోధకులు.
''కరోనా వైరస్ నియంత్రణలో కీలక ముందడుగు వేశాం. ఇంత తక్కువ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి నమూనాలను సేకరించి పరిష్కారం పొందగలిగాం. అయితే.. ఎంతో ముఖ్యమైనది ఏంటంటే దీనిని త్వరగా అంతర్జాతీయంగా ఇతరులతో పంచుకోవాలి. అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి.. ఒక టూల్కిట్ అభివృద్ధి చేయాలి. ఇది వ్యాధి నిర్ధరణ, వ్యాక్సిన్, చికిత్సా విధానానికి ఎంతో ఉపయోగకరం.''
-డాక్టర్ మైక్ కాటన్, శాస్త్రవేత్త
చాలా ఏళ్లుగా ఇలాంటి వైరస్లపై పరిశోధనలు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని, అందుకే ఇంత త్వరగా దీనికి పరిష్కారం పొందగలిగామని వెల్లడించారు కాటన్.
యాంటీబాడీ పరీక్షతో.. అనుమానిత రోగులను పరీక్షించి, తద్వారా వైరస్ ఎంత విస్తృతంగా ఉంది, తదితర విషయాలు, మరణాల రేటు గురించి మరింత కచ్చితమైన సమాచారం తెలుసుకోవచ్చని కాటన్ అన్నారు.
ఇదీ చూడండి:కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న అమెరికా!