పాకిస్థాన్‌లో భారీ భూకంపం(earthquake in Pakistan) సంభవించింది. ఈ ఘటనలో.. 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప(earthquake news) తీవ్రత 6గా నమోదైనట్లు పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లో భారీ భూకంపం- 20మంది మృతి - భూకంపం
06:15 October 07
పాకిస్థాన్‌లో భారీ భూకంపం- 20మంది మృతి
గురువారం తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో.. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు చెప్పారు.
క్వెట్టాలో భూప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు రోడ్లమీదికి వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
హర్నాయ్‌కు సమీపంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు భూకంపశాస్త్ర కేంద్రం తెలిపింది. బలుచిస్థాన్‌లోని.. క్వెట్టా, సిబి, హర్నాయ్, పిషిన్, కిలా సైఫుల్లా, ఛామన్, జియారత్, జోబ్లపై భూకంపం ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. హర్నాయ్లో సుమారు 70 వరకు భవనాలు కూలిపోయాయని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. సహాయక చర్యలు చేపట్టారు.