అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు భీకర దాడులకు తెగబడ్డారు. ఆరుగంటల పాటు కాల్పులు జరిపి... అనంతరం సమాచార శాఖ కార్యాలయం ఎదుట ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశాడు. ఇదే తరహా దాడికి యత్నించిన మరో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఈ ఘటనలో ముగ్గురు సైనికులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదు. ఖతార్ వేదికగా తాలిబన్లతో ప్రభుత్వం జరపాల్సిన చర్చలు శుక్రవారం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లే దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఆరోపణలకు వివరణనిచ్చింది తాలిబన్. ఉగ్రదాడి తమ పని కాదని ప్రకటించింది.
ప్రభుత్వ కార్యాలయ సముదాయంలోకి వెళ్లకుండా ఉగ్రవాదులను అడ్డుకోగలిగామని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. కార్యాలయ సముదాయంలోకి వెళ్లి ఉంటే 2700మంది ఉద్యోగులకు ముప్పు వాటిల్లేదని తెలిపింది.
ఇదీ చూడండి: 'నన్ను విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదు'