తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2021, 8:41 PM IST

ETV Bharat / international

ట్రంప్​ కథ ముగిసినట్లేనా- మళ్లీ పీఠమెక్కుతారా?

రెండోసారి అగ్రరాజ్య పెద్దన్నగా వెలుగొందాలన్న ట్రంప్​ కలలు నెరవేరలేదు. ట్రంప్​ ఆశలకు గండిపడిన నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితం ఇక్కడితో ముగియనుందా? లేదా 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ట్రంప్​ ప్రణాళిక ఏంటి? డొనాల్డ్​ అభిమానులు తమ నేతను మరోసారి అగ్రరాజ్యం పీఠంపై కూర్చొబెడతారా?

వరుసగా రెండోసారి అధ్యక్షుడు కావాలని కలలుగని విఫలమైన డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ 2024లో ఆ పదవి కోసం ప్రయత్నిస్తారా? అమెరికా రాజకీయ వర్గాల్లో మొదలైన ప్రశ్న ఇది! పట్టువదలని విక్రమార్కుడైన ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడు అయ్యేందుకు సాంకేతికంగానైతే అవకాశముంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కావొచ్చు. 'ఈసారి ఓడినంత మాత్రాన ట్రంప్‌ రాజకీయంగా సన్యాసం తీసుకున్నట్లు కాదు. మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు తగ్గ శక్తిసామర్థ్యాలు ఆయనకున్నాయి' అని ట్రంప్‌ మాజీ సలహాదారు బ్రయాన్‌ లాంజా తెలిపారు.

ఒకవేళ అందుకు సిద్ధమైతే మాత్రం మరో నాలుగేళ్ల తర్వాత వచ్చే పోరుకు ట్రంప్‌ ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సి ఉంటుంది. అయితే, రిపబ్లికన్‌ పార్టీలో తన అవకాశాలను కోల్పోకుండా చూసుకోవాలి. ఇప్పటిదాకా రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌కు తిరుగులేని పరిస్థితి. ఓడిపోయినా.. ప్రజల్లోనూ ఆయనకు బలమైన మద్దతుందనే సంగతి ఈ ఎన్నికల్లో రుజువైంది. అధ్యక్ష పదవిలో ఓడిపోయి.. ఎన్నికల తీరు, ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ట్రంప్​ అభిమానులు ఆయన్ను ఏనాడు వదల్లేదు. 2024లో ట్రంప్‌ 78 ఏళ్ల వయసుకొస్తారు. అదేమీ అనర్హత కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఎంపికైన బైడెన్‌కు ఇప్పుడు అదే వయసు.

ఇలా ఒక పర్యాయం అధ్యక్ష పదవిలో ఉండి.. ఓడి.. మళ్లీ రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర అమెరికాలో ఉంది.

ఇదీ చూడండి:ట్రంప్​ 2.0: 'మిషన్​ 2024'కు సన్నద్ధం!

1884లో అమెరికా 22వ అధ్యక్షుడిగా వ్యవహరించిన గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ తర్వాతి ఎన్నికలో ఓడిపోయారు. మళ్లీ ఆయన 1892లో పోటీ చేసి 24వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ట్రంప్‌ కూడా అలాగే చేయొచ్చన్నది ఆయన అభిమానుల సూచన. కానీ, 2024లో తాను కాకుండా.. తన కుమార్తె ఇవాంకాను ట్రంప్‌ బరిలో దించినా ఆశ్చర్య పోనవసరం లేదనే వారు కూడా లేకపోలేదు.

అగ్గిబరాటాగా పేరొందిన ట్రంప్‌...

ట్రంప్​.. నిమ్మళంగా ఉండే వ్యక్తి కాదని, సొంత టెలివిజన్‌ నెట్‌వర్క్‌, మీడియా సంస్థను నెలకొల్పే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల అనంతరం.. ఆ పదవిలో మూడు నెలలు కొనసాగిన ట్రంప్​.. ప్రత్యర్థిపై న్యాయస్థానాల్లో మరిన్ని కేసులు వేస్తూ.. అధికార మార్పిడిని సాధ్యమైనంత సంక్లిష్టంగా మార్చారు. అనంతరం జనవరి 6న జరిగిన క్యాపిటల్​ హింసాకాండ్​లో తన మద్దతారులను ప్రేరేపించారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.

మరి 2024 అధ్యక్ష రేసులో ట్రంప్​ నిలబడి విజయం సాధిస్తారా? ఆయన అభిమానులు మరోసారి ఆయనకు మద్దతుగా నిలుస్తారా? వేచి చూడాలి.

ఇదీ చూడండి: గెలుపైనా.. ఓటమైనా... నిను వీడని నీడ మేమే!

ABOUT THE AUTHOR

...view details