అమెరికాలో రోజురోజుకీ కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతుండటం ఆ దేశ ప్రజల్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. మంగళవారం ఒక్కరోజే 1900 మంది బలయ్యారు. ఆ దేశంలో ఇప్పటివరకు 4లక్షల మందికిపైగా ఈ వైరస్ బారినపడ్డారు. మొత్తం 12,854మంది మృతి చెందారు. శ్వేతసౌధం యంత్రాంగమంతా వైరస్‌ను కట్టడి చేసే పనిలో నిమగ్నమైంది. అయినా ఆశాజనక ఫలితాలు రావడం లేదు. పైగా రానున్న రోజుల్లో మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదురుకాబోతున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది.
డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల నిలిపివేత...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా నుంచి ఇవ్వాల్సిన నిధుల్ని నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అంతటితో ఆగకుండా సంస్థపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డబ్ల్యూహెచ్‌ఓ చైనా అనుకూల వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో దాని ప్రమాదంపై సంస్థ వద్ద సమాచారం ఉందని.. అయినా పంచుకోవడానికి ఇష్టపడలేదని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి విషయంలో చాలా తప్పటడుగులు వేసిందని విమర్శించారు. చైనాలో కొవిడ్-19 విజృంభణ కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తే డబ్ల్యూహెచ్‌ఓ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఇది అతిపెద్ద తప్పుడు నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూహెచ్ఓను కొనియాడిన ఐరాస