ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలుగుతున్నామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు ట్రంప్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ నిర్ణయం 2021 జులై 6 నుంచి అమల్లోకి రానుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
అమెరికా ఉపసంహరణకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓ నిబంధనలను గుటెర్రస్ పరిశీలిస్తున్నట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ షరతులకు అనుగుణంగా అమెరికా ప్రకటన ఉందా అనే విషయాన్ని ధ్రువీకరించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.
వైదొలగాలంటే ఎలా..
డబ్ల్యూహెచ్ఓ ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. వైదొలిగే ఏడాది ముందు ఐరాసకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఉపసంహరణకు ముందే డబ్ల్యూహెచ్ఓకు అమెరికా ఇచ్చిన ఆర్థిక హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.
డబ్ల్యూహెచ్ఓకు 400 మిలియన్ డాలర్లతో అతిపెద్ద స్పాన్సర్‌గా ఉన్న అమెరికా.. ఇంకా 230 మిలియన్ డాలర్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు 2020-21 కాలంలో స్వచ్ఛందంగా అందిస్తామన్న 650 మిలియన్ డాలర్ల హామీని నెరవేర్చాల్సి ఉంటుంది.