ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ను అస్త్రంగా ఎంచుకున్నాయి. అయినప్పటికీ కొవిడ్-19 ఉద్ధృతి ఇంకా తగ్గని కారణంగా లాక్‌డౌన్ నిబంధనలు ఇంకొన్నాళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే కొన్ని దేశాల్లో ప్రజల నుంచి ఇందుకు వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికా, బ్రెజిల్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి లాక్‌డౌన్ సడలింపు డిమాండ్‌తో నిరసనలకు దిగిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
అమెరికాలో..
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోనే ఎక్కువగా ఉంది. ఈ దేశంలో ఇప్పటి వరకు 7.38 లక్షల మందికిపైగా వైరస్ సోకింది. 39 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో లాక్‌డౌన్ సడలింపునకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలనూ విడుదల చేసింది ట్రంప్ ప్రభుత్వం.
ఇండియానాలో నిరసనలు..
ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా రాష్ట్రాల గవర్నర్లు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపునకు మద్దతివ్వని గవర్నర్లకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా ఇండియానా రాష్ట్రంలో గవర్నర్ భవనం ముందు ప్రజలు ఆందోళనకు దిగారు. లాక్‌డౌన్‌ను మే 1 వరకు పొడిగిస్తూ గవర్నర్ ఎరిక్ హోల్‌కాంబ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇండియానాలో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు ఇది వరకే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు నిరసనలు తెలపగా వారికి ట్రంప్ పరోక్షంగా మద్దతు పలికారు.
ట్రంప్ ఒత్తిడి..
నిబంధనలు సడలించాలని ఇతర రాష్ట్రాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి తోడు లాక్‌డౌన్ సడలింపునకు అధ్యక్షుడు ట్రంప్ నుంచి కూడా ఆయా రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఫ్లోరిడాలో ప్రజలు నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఏకంగా బీచ్‌లు, పార్క్‌లకు వెళ్తున్నారు.
టెక్సాస్‌లో త్వరలో సాధారణ అమ్మకాలు ప్రారంభించేందుకు పలు స్టోర్లు నన్నద్ధమవుతున్నాయి. ఆస్పత్రులూ అత్యవసరంతో పాటు అన్ని రకాల సర్జరీలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
మతపెద్దలతో చర్చలు..
లాక్‌డౌన్ కారణంగా అమెరికాలో మతపరమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అన్ని ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మతపెద్దలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే సమావేశమయ్యారు. లాక్‌డౌన్ నిబంబధనల సడలింపు తర్వాత పరిణామాలపై చర్చలు జరిపారు.
బ్రెజిల్‌లో అధ్యక్షుడి మద్దతుదారుల నిరసనలు..
అమెరికా తరహాలోనే బ్రెజిల్‌లోనూ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు రియో డీ జెనిరోలో నిరసనలు చేపట్టారు. లాక్‌డౌన్ పొడిగింపును తప్పుబడుతూ రియో గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లాక్‌డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే స్వీయ నిర్భందంలో ఉండేలా అధ్యక్షుడు బొల్సొనారో ప్రతిపాదించిన 'వర్టికల్ ఐసోలేషన్' విధానాన్ని అమలు చేయాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఆలోచించాలని నిరసనకారులు సూచించారు.
బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 36,900 పైగా కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వారిలో 2,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:ఆ దేశాల్లో 90శాతం విమానాలు నేలపైనే..