తెలంగాణ

telangana

By

Published : May 6, 2021, 1:29 PM IST

ETV Bharat / international

ఆకలి సంక్షోభం- 15.5కోట్ల మందిపై ప్రభావం

2020లో 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడించాయి. 2021లో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించాయి. నిధులు లేకపోవడం వల్ల సహాయ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరగడం లేదని తెలిపాయి.

hunger crisis
ఆకలి సంక్షోభం

ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తీవ్రమయ్యాయి. 2020 ఏడాదిలో కనీసం 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడ్డారని 16 అంతర్జాతీయ సంస్థలు తయారు చేసిన నివేదికలో వెల్లడైంది. అందులో ఆహారం అందించకపోతే చనిపోయే స్థితిలో లక్షా 33 వేల మంది ఉన్నారని తేలింది. 97 శాతం మానవతా సహాయం పొందుతున్న 55 దేశాల సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థలు పతనం కావడం, ఘర్షణలు, ప్రతికూల వాతావరణం ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చిందని నివేదిక అభిప్రాయపడింది.

నివేదిక ముఖ్యంశాలు

  • విపత్తు, కరవు, అత్యయిక స్థితి సమయాల్లో ఉన్న పరిస్థితుల స్థాయిలో.. 15.5 కోట్లు మంది ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.
  • 2019తో పోలిస్తే ఈ సంఖ్య రెండు కోట్లు ఎక్కువ.
  • మూడింట రెండో వంతు మంది ప్రజలు పది దేశాల్లోనే ఉన్నారు. అవి: కాంగో, యెమెన్, అఫ్గానిస్థాన్, సిరియా, సుడాన్, ఉత్తర నైజీరియా, ఇథియోపియా, దక్షిణ సుడాన్, జింబాబ్వే, హైతీ.
  • ఆకలితో మరణ ముప్పును ఎదుర్కొంటున్న లక్షా 33 వేల మంది బుర్కినా ఫాసో, దక్షిణ సుడాన్, యెమెన్ దేశాల్లో ఉన్నారు.
  • ఆహార సంక్షోభానికి ప్రధాన కారణం ఘర్షణలే. దీని వల్ల 23 దేశాల్లోని 9.9 కోట్ల మందిపై ప్రభావం పడింది.
  • కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావంతో 17 దేశాల్లోని 4.05 కోట్ల మంది అత్యంత తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొన్నారు.
  • 15.5 కోట్ల మందిలో 60-80 శాతం మంది వ్యవసాయ ఆధారిత ఆహార అభద్రతకు గురయ్యారు. 30 శాతం మంది ప్రజలకు మాత్రమే ఎఫ్ఏఓ(ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ) సాయం చేయగలిగింది.
  • 2020లో 55 దేశాల్లోని 7.52 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఎదుగుదల లోపంతో బాధపడ్డారు. 1.58 కోట్ల మంది తమ ఎత్తుకు తగినంత బరువు లేరు.
  • సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సుడాన్, సిరియా దేశాల్లోని జనాభాలో సగం కంటే ఎక్కువ మంది అఫ్గానిస్థాన్, హైతీ, లెసోతో, యెమెన్, జింబాబ్వే దేశాల్లో 40-45 శాతం మంది ఆహార సంక్షోభంలో ఉన్నారు.

మారని దుస్థితి

2021లోనూ పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదని నివేదిక పేర్కొంది. ఆహార సంక్షోభం దీర్ఘకాల సమస్యగా మారిపోతోందని తెలిపింది. దీన్నుంచి బయటపడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

40 దేశాల సమాచారంతో ఈ ఏడాది పరిస్థితులను నివేదిక అంచనా వేసింది. ఈ దేశాల్లో 14.2 కోట్ల మంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. 2021 అర్ధభాగం ముగిసేనాటికి లక్షా 55 వేల మంది విపత్తు పరిస్థితుల్లో ఉంటారని పేర్కొంది.

డబ్బే సమస్య

నిధులు లేకపోవడమే వీరందరికీ సహాయం చేయడానికి ఉన్న ఏకైక అడ్డంకి అని ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఈపీ) ముఖ్య ఆర్థికవేత్త ఆరిఫ్ హుస్సేన్ తెలిపారు. 3.4 కోట్ల మందికి రోజుకు ఒక్కపూట భోజనం పెడితే సంవత్సరానికి అయ్యే ఖర్చు 36,932 వేల కోట్లకు పైగా ఉంటుందని లెక్కగట్టారు. నిధులు లేకపోవడం వల్లే ప్రాణాలు కాపాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:అద్భుతం: ఒకే కాన్పులో 9 మంది జననం

ABOUT THE AUTHOR

...view details