కరోనా సంక్షోభం నేపథ్యంలో కొంతకాలం పాటు అగ్రరాజ్యానికి ఎవరూ వలస రాకుండా నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు 60 రోజుల పాటు కొత్త గ్రీన్‌కార్డుల మంజూరును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అయితే తాత్కాలిక వీసాల ద్వారా అమెరికాకు వచ్చే వారిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేశారు ట్రంప్.
60 రోజుల పాటు తాత్కాలిక వలసల్ని రద్దు చేసే నిర్ణయంలో భాగంగానే గ్రీన్‌కార్డులను నిలిపివేస్తున్నారు. తర్వాత అమెరికా ఆర్థిక పరిస్థితిని బట్టి తదపరి నిర్ణయం ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.