అమెరికాలోని హ్యూస్ట్న్లో ప్రధాని నరేంద్ర మోదీ, అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నెల 22న జరిగే 'హౌదీ మోదీ' సభ ఇందుకు వేదిక కానుంది. ఈ విషయాన్ని శ్వేతసౌధం అధికారిక ప్రకటనలో తెలిపింది.
మోదీ-ట్రంప్ సమావేశంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య విభేదాలకు తెరపడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఎగుమతులపై సుంకాల్లో రాయితీలు కల్పించే ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) జాబితా నుంచి మన దేశాన్ని ఇప్పటికే తొలగించింది అమెరికా. ఆ దేశంలో నివసించే విదేశీయుల్లో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మోదీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు.. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి అనుకూలిస్తాయని ఆయన సన్నిహితులు భావిస్తున్నట్లు సమాచారం.