తెలంగాణ

telangana

ETV Bharat / international

పరిపాలన సన్నద్ధతలో బైడెన్​- న్యాయపోరాటంలో ట్రంప్​! - జోబైడెన్​ వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​ విజయం సాధించారు. అగ్రరాజ్య పీఠాన్ని అధిరోహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు​. మరోవైపు.. తన ఓటమిని అంగకరించేందుకు నిరాకరిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్​. న్యాయపోరాటానికి దిగారు. పలువురు రిపబ్లికన్ నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు చాలా సమయం ఉందని.. కచ్చితమైన, నిజాయతీగల ఓట్ల లెక్కింపునకు అన్ని అవకాశాలను అన్వేషిస్తామని స్పష్టం చేశారు ట్రంప్​.

America elections
జో బైడెన్​, డొనాల్డ్​ ట్రంప్​

By

Published : Nov 10, 2020, 5:26 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిదనేది ఇప్పటికే తేలింది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్​ బ్యాలెట్లను స్వీకరించటమే అందుకు కారణం. ఈ క్రమంలో భారీ మెజారిటీతో విజయం చేజిక్కించుకున్న డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్​.. దేశ పరిపాలన కోసం సన్నద్ధమవుతున్నారు. మరోవైపు.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాత్రం అధికార మార్పిడికి ఒప్పుకోవటానికి ససేమిరా అంటున్నారు. అధ్యక్ష ఎన్నికలు ముగిసేందుకు ఇంకా చాలా సమయం ఉందని, కచ్చితమైన, నిజాయతీగల ఓట్ల లెక్కింపునకు అన్ని అవకాశాలను అన్వేషిస్తామని పేర్కొంటున్నారు ఆయన మద్దతుదారులు.

ఇప్పటికే.. కొన్ని కీలక రాష్ట్రాల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్​. అయితే.. ఓటింగ్​లో అవకతవకలు, ఎన్నికల్లో భారీ మోసం జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు ట్రంప్​ నిరాకరిస్తున్న క్రమంలో ఈ ప్రక్రియ డిసెంబర్​ అర్ధభాగం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడే 538 మంది ఎలక్టోరల్​ కాలేజీ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు వీలుకలుగుతుంది.

538 ఎలక్టోరల్​ కాలేజీ ఓట్లలో బైడెన్ మొత్తం​ 290 ఓట్లు గెలుచుకున్నట్లు పలు మీడియా సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుత అధ్యక్షుడికి కేవలం 214 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఎన్నికల్లో విజయం సాధించిన క్రమంలో జో బైడెన్​.. తన తొలి ప్రాధాన్యం కరోనా వైరస్​ను కట్టడి చేయటమేనని సోమవారం ప్రకటించారు. అందుకు టాస్క్​ఫోర్స్​ను కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ట్రంప్​ అనుమతి లేకుండా.. జనవరి వరకు ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు బైడెన్​. తన ఓటమిని ట్రంప్​ బహిరంగంగా అంగీకరించటం లేదు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఆస్కారం కనిపించటం లేదు.

ట్రంప్​కు మద్దతుగా..

ఓటింగ్​లో మోసం జరిగినట్లు సోమవారం ఆరోపణలు చేశారు శ్వేతసౌధ మీడియా కార్యదర్శి మెక్​ఎనానీ.

" ఈ ఎన్నికలు ఇంకా ముగియలేదు. అందుకు చాలా సమయం ఉంది. కచ్చితమైన, నిజాయతీ గల ఓట్ల లెక్కింపు కోసం మా ప్రక్రియను ప్రారంభించాం. ప్రస్తుత ఎన్నికలతో పాటు, రాబోవు చాలా ఎన్నికలపై నమ్మకం కావాలనుకుంటున్న అమెరికన్ల హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. అమెరికాలో ఒకే ఒక్క పార్టీ ఓటర్​ గుర్తింపుకార్డు, సంతకాలు, పౌరసత్వం, నివాసం, అర్హత వంటి వాటిని ధ్రువీకరించటాన్ని వ్యతిరేకించింది. లెక్కింపు కేంద్రాల నుంచి పరిశీలకులను దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. అదే డెమొక్రటిక్​ పార్టీ. "

- మెక్​ఎనానీ, శ్వేతసౌధం మీడియా కార్యదర్శి.

ఎన్నికల్లో అవకతవకలకు వ్యతిరేకంగా మిచిగాన్​లో రెండు కొత్త వ్యాజ్యాలు దాఖలు చేసినట్లు తెలిపారు రిపబ్లిక్​ జాతీయ కమిటీ చైర్​పర్సన్​ మెక్​డానియల్​. చివరి అంశం తేలేవరకు తమ ప్రయత్నాన్ని వదులుకోమని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రశ్నించేందుకు అధ్యక్షుడు తన హక్కులను వంద శాతం వినియోగించుకుంటారని పేర్కొన్నారు సెనేట్​ మెజారిటీ నేత మిచ్​ మక్కన్నేల్​. చాలా మంది రిపబ్లికన్​ నాయకులు ట్రంప్​నకు మద్ధతుగా నిలిచారు.

మరోవైపు.. రాష్ట్రాలు ఎన్నికల ఫలితాలను ప్రకటించక ముందే ఓటింగ్​లో అవకతవలను పరిశీలించాలని ఫెడరల్​ ప్రాసిక్యూటర్లకు సూచించారు అటార్నీ జనరల్​ వినియం బార్​. అయితే.. బార్​ తీరు న్యాయవిభాగం ఉన్నతస్థాయి ఎన్నికల నేర ప్రాసిక్యూటర్ రిచర్డ్​ పిల్గర్​ రాజీనామాకు దారి తీసింది. బ్యాలెట్​ మోసం పరిశోధనల కోసం 40 ఏళ్లుగా ఉన్న పాలసీని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో అటార్నీ జనరల్​ ఉన్నారని తన సహోద్యోగులకు ఈ మెయిల్​ ద్వారా తెలిపారు పిల్గర్​.

ఇదీ చూడండి: 'ఎన్నికల అక్రమాల'పై రిపబ్లికన్ల పోరు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details