తెలంగాణ

telangana

ETV Bharat / international

'విజయం మాదే.. 300 ఎలక్టోరల్​లు గెలుస్తాం'

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ స్పందించారు. స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. 300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. దేశం కోసం పనిచేయడమే రాజకీయాల ఉద్దేశమని ట్రంప్​ను ఉద్దేశించి అన్నారు.

The numbers tell us a clear and convincing story. We are going to win this race
జో బైడెన్

By

Published : Nov 7, 2020, 10:12 AM IST

Updated : Nov 7, 2020, 10:49 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నట్లు డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. 300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు గెలిచే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్‌.. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కొవిడ్​ కట్టడికి పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు.

"అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ గెలిచినట్లు ఇప్పుడే ప్రకటించట్లేదు. అయితే ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని తాజాగా వెలువడుతున్న ఫలితాలే చెబుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ల చేతిలో ఓడిపోయిన చాలా రాష్ట్రాలు ఇప్పుడు నీలవర్ణంలోకి మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధించబోతున్నాం. ట్రంప్‌పై 40లక్షల ఓట్లతో గెలుస్తున్నాం. 300కి పైగా ఎలక్టోరల్‌ ఓట్లు సాధించబోతున్నాం"

-జో బైడెన్‌, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి

ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు పరోక్షంగా చురకలంటించారు బైడెన్. దేశం కోసం పనిచేయడమే రాజకీయాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తాము ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదని అన్నారు.

"ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలవబోతున్నాం. ట్రంప్‌పై 4 మిలియన్‌ ఓట్ల తేడాతో గెలుస్తున్నాం. సంయమనం పాటించండి... అందరి ఓట్లు లెక్కిస్తారు. ఈ ఎన్నికలు ఎంతో కఠినంగా సాగుతున్నాయి. ఇంతటి కఠినమైన ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు, ఆందోళనలు ఉంటాయని తెలుసు. మేం ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నించాం. కానీ కొందరు దీన్ని ఆపేందుకు యత్నిస్తున్నారు. కానీ నేను దాన్ని జరగనివ్వను. ప్రజాస్వామ్యంలో బలమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ రాజకీయాల ఉద్దేశం దేశం కోసం పనిచేయడమే. మనం ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. మనం అమెరికన్ జాతీయులం."

-జో బైడెన్‌, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి

అన్ని ప్రాంతాలు, మతాలకు అతీతంగా రికార్డు స్థాయిలో అమెరికన్లు మార్పును కోరుకుంటున్నారని ఫలితాలతో స్పష్టమవుతోందని అన్నారు బైడెన్. కరోనావైరస్, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ మార్పు, జాతి విద్వేషం తదితర అంశాల్లో తాము ప్రకటించిన ప్రణాళికలకు ఇది ప్రజలిస్తున్న తీర్పు అని అభివర్ణించారు.

"కరోనా నివారణ, విద్వేషాన్ని అరికట్టేందుకు అనేక ప్రణాళికలు తయారుచేశాం. అవి ప్రజలకు చేరువయ్యేలా చూశాం. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మా ప్రణాళికలను అమల్లోకి తెస్తాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. క్లిష్ట సమస్య పరిష్కారానికే(కరోనాను ఉద్దేశిస్తూ) మా తొలి ప్రాధాన్యత"

-జో బైడెన్, డెమొక్రాటిక్ అభ్యర్థి

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌కు అత్యంత చేరువలో నిలిచారు బైడెన్‌. కీలక రాష్ట్రమైన జార్జియా, నెవడాలోనూ డెమొక్రాటిక్‌ నేత ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Last Updated : Nov 7, 2020, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details