అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులపైనే అత్యధికంగా విద్వేషపూరిత నేర ఘటనలు నమోదవుతున్నాయని ఆ దేశ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వెల్లడించింది. 2018లో జరిగిన నేరాలకు సంబంధించి వార్షిక నివేదికను విడుదల చేస్తూ... ఆ సంవత్సరంలో మొత్తం 7,120 విద్వేషపూరిత నేరాలు నమోదైనట్లు పేర్కొంది. 2017(7,175 నేరాలు)తో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు తెలిపింది.
మతాలవారీగా
2018లో యూదులపై అత్యధికంగా 835 విద్వేషపూరిత నేరాలు నమోదు కాగా ముస్లింలపై 188 ఘటనలు నమోదయ్యాయి. సిక్కులపై 60, ఇతర మతాలవారిపై 91 నేరాలు నమోదైనట్లు ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. ఇందులో హిందువులపై 12, బౌద్ధులపై 10 నేరాలు నమోదైనట్లు వివరించింది.
జాతి వివక్ష నేరాలు
జాతి వివక్షతతో మొత్తం 4,047 నేరాలు జరిగినట్లు నివేదికలో స్పష్టమైంది. ఇందులో అత్యధికంగా నల్లజాతి లేదా ఆఫ్రికా అమెరికన్లపై 1943 నేరాలు జరిగినట్లు పేర్కొంది. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా 762, స్పెయిన్ దేశస్థులకు వ్యతిరేకంగా 485 నేరాలు నమోదయ్యాయి.
తక్కువ చేసి చూపిస్తున్నారు
అయితే అమెరికాలో జరుగుతున్న విద్వేషపూరిత నేరాలను తక్కువ చేసి చూపిస్తున్నారని యూఎస్‌లోని సిక్కు సంకీర్ణ వర్గాలు ఆరోపించాయి.
'ఫెడరల్ బ్యూరో ఆఫ్ జస్టిస్ స్టాటిస్టిక్స్ ప్రకారం అమెరికన్లు ఏడాదికి 2,50,000 విద్వేషపూరిత నేరాలను ఎదుర్కొంటున్నారు. ఎఫ్‌బీఐ మాత్రం దీనికి విరుద్ధంగా కేవలం 7,120 ఘటనలు జరిగినట్లు చెబుతోంది. ఈ గణాంకాలు వాస్తవాలను తెలియజేయడం లేదు. కొన్ని సమాజాలను లక్ష్యంగా చేస్తున్న ఇటువంటి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొవాలి.'
-సిక్కు వర్గాలు