కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తాము తయారు చేసిన 'రెమిడెసివిర్' ఔషధం చక్కగా పని చేస్తోందని కాలిఫోర్నియా(అమెరికా)కు చెందిన 'గిలీద్ సైన్సెస్' ప్రకటించింది. శరీరంలోకి చొరబడిన వైరస్ విశృంఖలంగా విస్తృతి చెందకుండా ఇది అడ్డుకట్ట వేస్తోందని తెలిపింది. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్పెక్షియస్ డీసీజెస్(ఎన్‌ఐఏఐడీ) సహకారంతో గిలీద్ సైన్సెస్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. మొత్తం 1090 మంది ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. రెమిడెసివిర్ ఔషధం తీసుకొన్న రోగులు కోలుకునే సమయం 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గినట్లు గుర్తించారు. "31% మెరుగ్గా ఫలితాలు ఉన్నంత మాత్రాన 100% ఫలితాలు లభించినట్లు కాదు. అయితే మరణాల రేటు(11.6% నుంచి 8%కు) తగ్గడమూ విజయంగానే భావించాలి. ప్రాణాలను కాపాడటానికి ఇది మెరుగ్గా ఉపయోగపడుతుందని అర్థమవుతోంది" అని ఫౌచీ చెప్పారు.
భారత సంతతి మహిళ నేతృత్వంలో..
మరోపక్క గిలీద్ సైన్సెస్ కూడా అమెరికాలోనే సొంతంగా మరో ప్రయోగం చేసింది. రెండు బృందాలుగా 397 మంది రోగులపై వేర్వేరు డోసుల్లో ఈ ఔషధాన్ని వినియోగించింది. 5రోజులపాటు ఈ ఔషధాన్ని వాడిన వారు ఎలా స్పందించారో... 10రోజులపాటు వాడిన వారు సైతం అలానే స్పందించారు. భారత సంతతికి చెందిన అంటువ్యాధుల నిపుణురాలు డాక్టర్ అరుణ సుబ్రమణియన్ ఈ ప్రయోగానికి నేతృత్వం వహించారు. ఆమె స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికీ కొంత అదనపు సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అరుణ పేర్కొంటున్నారు.
చైనాలో కోలుకోలేదన్న లాన్సెట్
అమెరికా డాక్టర్ ఫౌచీ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ప్రముఖ మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్'లో భిన్నమైన పరిశోధన పత్రం వెలువడింది. చైనాలో 18 ఏళ్ల వయస్సు దాటిన 237 మందిపై నిర్వహించిన ప్రయోగంలో రెమిడెసివిర్ వాడిన రోగులు... మిగిలిన ఔషధాలు వాడిన వారితో పోలిస్తే వేగంగా కోలుకొన్న దాఖలాలు లేవన్నది దీని సారాంశం. కానీ, కరోనా చికిత్సకు పరీక్షించేందుకు పరిగణనలోకి తీసుకోదగ్గ ఔషధాల్లో ఇది కూడా ఒకటని తేల్చారు. అలాగే... గిలీద్ ప్రయోగ ఫలితాలపై తక్షణమే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.
ఇదీ చూడండి:ఈ ఔషధంతో కరోనా చికిత్సపై చిగురించిన ఆశలు!