వేగంగా విస్తరిస్తోన్న కరోనా.. ప్రపంచ దేశాల ఆందోళన కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఈ వ్యాధిని అరికట్టేందుకు అవసరమైన చర్యల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మాస్కులు, గాగుల్స్ ఇతర వైద్య పరికరాల కొరత మార్కెట్లో తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వ్యక్తిగత రక్షణ పరికరాలకు ప్రస్తుతం ఉన్న డిమాండ్, దుర్వినియోగం కారణంగా.. వైరస్ వ్యాప్తి చెందిన ప్రపంచ దేశాలకు వాటిని అందించడం కష్టమవుతున్నందుకు మేము చింతిస్తున్నాం.
-టెడ్రోస్ అధనామ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
వైద్య సిబ్బందికి రక్షణ కల్పించకుండా కరోనాను అరికట్టడం అసాధ్యమని టెడ్రోస్ ఉద్ఘాటించారు. ప్రస్తుతం శస్త్ర చికిత్స చేసేందుకు ఉపయోగించే మాస్కుల ధర ఆరురెట్లు పెరగ్గా.. వెంటిలేటర్లకు అయ్యే ఖర్చు మూడు రెట్లు అధికమైనట్లు వివరించారు. ప్రజల భయాందోళనతో వీటిని నిల్వ చేసుకునేందుకు పోటీపడుతున్నారని టెడ్రోస్ పేర్కొన్నారు. ఇప్పటికే 27 దేశాలకు లక్షల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలను పంపినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
కరోనా వల్ల ప్రతి నెలా 8.9 కోట్ల మాస్క్‌లు, 76 మిలియన్ల చేతి గ్లౌజ్‌లు, 1.6 మిలియన్ల వరకు గాగుల్స్ అవసరమవుతాయని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 3,100 మందికిపైగా మరణించారు. సుమారు 77 దేశాల్లో 92 వేలమంది కరోనా బారిన పడ్డారు.