కరోనా నివారణ టీకా వేటలో మరో శుభ శకునం కనిపించింది. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని 'ది జెన్నర్ ఇన్స్టిట్యూట్' అభివృద్ధి చేస్తున్న టీకాను తీసుకొన్న ఆరు రీసెస్(ఆసియా జాతి) కోతులు వైరస్ను నిలువరించాయి. దీంతో ఈ టీకా నమ్మకమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే మనుషులపై ఈ టీకా ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు.
దీనికి సంబంధించి జంతువులపై ప్రయోగం మార్చిలోనే మొదలైంది. అమెరికాలోని మాన్టానలోని రాకీమౌంటెన్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రయోగశాలలో దీనిని నిర్వహించినట్లు 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది. తొలుత టీకా ఇవ్వని ఆరు కోతులను కరోనా వైరస్ బారినపడేలా చేశారు. అవి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాయి. మరో ఆరు కోతులకు ఈ టీకాను ఇచ్చారు. ఆ తర్వాత వాటిని కూడా వైరస్ బారినపడేలా చేశారు. 28 రోజుల తర్వాత కూడా రెండో బ్యాచ్ ఆరు కోతుల్లో ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. ఈ కోతుల డీఎన్ఏ, మనుషుల డీఎన్ఏకు 93 శాతం పోలిక ఉంటుంది.
టీకాలో డబ్బును చూడొద్దు