న్యూయార్క్‌లోని ఓ నర్సింగ్ హోంలో 98 మంది కరోనా వైరస్ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ స్థాయిలో మరణాలు సంభవించడం వల్ల అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు.
మాన్‌హటన్‌లోని ఇసబెల్లా గేరియాట్రిక్ సెంటర్లో వైరస్ పాజిటివ్‌గా తేలిన 46 మంది మరణించారు. మరో 52మంది కూడా ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. వీరికి వైరస్ సోకినట్టు ఇంకా నిర్ధరణ కాలేదు.
న్యూయార్క్వ్యాప్తంగా మృతదేహాలు కుప్పలుకుప్పలుగా ఉండటం వల్ల నర్సింగ్ హోమ్స్‌లో మరణిస్తున్న వారికి ఖననం చేయడం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఇసబెల్లా సిబ్బంది రిఫ్రిజరేటర్లను ఆర్డ్‌ర్ చేయాల్సి వచ్చింది.
"న్యూయార్క్‌లోని ఇతర నర్సింగ్ హోమ్స్ లాగానే ఇసబెల్లాలో కూడా ఆరోగ్య వసతులు సరిగ్గా లేవు. ఇక్కడ ఉంటున్న వారికి, సిబ్బందికి పరీక్షలు నిర్వహించడం ఆలస్యమైంది. దీంతోపాటు లక్షణాలు కనిపించని కేసుల వల్ల పరిస్థితులు మారిపోయాయి. ఎవరికి వైరస్ ఉందో? లేదో? తెలుసుకోవడం కష్టమైంది. వైరస్ లక్షణాలున్న వారిని వేరు చేసినా ఫలితం దక్కలేదు. ఇసబెల్లాలో సిబ్బంది కొరత ఉండేది. ఇతర సంస్థల వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్నాం. వారికి పీపీఈ కిట్లు అందించడం తొలినాళ్లలో పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి."