సూర్యునికి సంబంధించిన అత్యంత వివరాణాత్మక ఫొటోలను విడుదల చేశారు అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు. అధునాతన డేనియల్ కె. ఇనోయ్ సోలార్ టెలిస్కోప్‌తో వీటిని చిత్రీకరించినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
సూర్యుని చుట్టూ పొరలా ఉండే ప్లాస్మా ఉడుకుతున్నట్లు ఈ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాప్‌కార్న్ తయారు చేసేందుకు ఉడికించే కుండలా సూర్యుడు కనిపిస్తున్నాడని శాస్త్రవేత్తలు చెప్పారు.
భూ ఆధారిత టెలిస్కోప్‌పై పని ప్రారంభించినప్పటి నుంచి ఈ చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూసినట్లు అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్ఎస్ఏ) డైరెక్టర్ ఫ్రాన్స్ కర్డోవా పేర్కొన్నారు. ఇప్పటివరకు సూర్యునికి సంబంధించి ఇంత వివరణాత్మక చిత్రాలను ఎవరూ తీయలేదన్నారు. సూర్యున్ని కప్పి ఉంచే కరోనాలోని అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన వివరాలను ఇనోయ్ సోలార్ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. సౌర విస్ఫోటనం కారణంగా భూవాతావరణం ప్రభావితమయ్యే అవకాశం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు. సౌర తుపానులు ఎప్పుడు సంభవిస్తాయో అంచనావేయవచ్చని ఫ్రాన్స్ కర్డోవా చెప్పుకొచ్చారు.
13 అడుగుల అద్దంతో..
టెలిస్కోప్‌కు ఉన్న 13 అడుగుల అద్దం ద్వారా ఈ ఫొటోలను చిత్రీకరించడం సాధ్యమైందని ఫ్రాన్స్ తెలిపారు. ఇది అత్యాధునిక సాంకేతిక టెలిస్కోప్ అని, దివంగత అమెరికన్ సెనేటర్ డేనియల్ ఇనోయ్ పేరును జోడించి దీనికి నామకరణం చేసినట్లు చెప్పారు.