కరోనా వైరస్‌ను కనుమరుగు చేయడానికి మన ఎదుట ఉన్న అత్యుత్తమ మార్గం టీకానే. దీన్ని కనుగొనడానికి సంప్రదాయ, వినూత్న మార్గాల్లో ప్రయత్నాలు మొదలయ్యాయి. మానవాళిని ఈ మహమ్మారి నుంచి కాపాడటానికి శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఫార్మా సంస్థలు యుద్ధప్రాతిపదికన కృషిచేస్తున్నాయి. అవకాశం ఉన్న ఏ మార్గాన్నీ వదిలిపెట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 96కుపైగా టీకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు సంస్థలు టీకాల సురక్షితను పరీక్షించటానికి ప్రయోగాలు ఆరంభించాయి. మరికొన్ని సంస్థలు జంతువులపై ప్రయోగ పరీక్షలు మొదలుపెట్టాయి. మానవాళికి ప్రాణభిక్ష పెట్టే ఈ టీకాలను ఎలా రూపొందిస్తారు? అవి ఎలా పనిచేస్తాయి? అనేవి కీలకాంశాలు.
వైరస్ ఆధారిత
కనీసం ఏడు బృందాలు అచేతనమైన లేదా బలహీన పరచిన వైరస్‌లతో టీకాలను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మీజిల్స్, పోలియో టీకాల వంటివన్నీ ఇలా రూపొందించినవే. ఈ రకం టీకాలు ఎంతవరకు సురక్షితమో తేలాల్సి ఉంది. బీజింగ్‌లోని సైనోవాక్ బయోటెక్ సంస్థ అచేతన వైరస్‌తో చేసిన టీకాను మనుషులపై పరీక్షిస్తోంది.
బలహీన వైరస్: ఈ టీకాల తయారీ కోసం వైరస్‌ను బలహీన పరుస్తారు. ఈ క్రమంలో అందులో జన్యుమార్పులు తలెత్తి అంతగా జబ్బు కలిగించలేని స్థితికి చేరుకుంటాయి. న్యూయార్క్, ఫార్మింగ్‌డేల్‌లోని ‘కోడజెనిక్స్’ అనే సంస్థ భారత్‌లోని ‘సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’తో కలిసి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. జన్యు సంకేతాలను మార్చి వైరస్‌ను బలహీనపరచటం, వాటి ప్రొటీన్ల సామర్థ్యాన్ని తగ్గించటం ఇందులోని ముఖ్యాంశం.
అచేతన వైరస్
ఇలాంటి టీకాల తయారీలో వైరస్‌ను ఫార్మల్‌డిహైడ్ వంటి రసాయనాలు లేదా వేడితో ఇన్‌ఫెక్షన్ కలిగించని విధంగా మారుస్తారు. ఇలా చేయటానికి ఇన్‌ఫెక్షన్ కలిగించే వైరస్‌లు పెద్దమొత్తంలో అవసరమవుతాయి.
- సర్వసాధారణంగా టీకాలను అభివృద్ధి చేసే విధానం ఇది. భారీగా ఉత్పత్తి చేయడానికి వనరులు ఉన్నాయి.
- సురక్షిత ప్రమాణాలను అందుకొని తీరాలి. అచేతన వైరస్‌లతో చేసే టీకాల ఉత్పత్తి కొంచెం కష్టంతో కూడుకొన్నది.
- అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ల సంఖ్య: 8
న్యూక్లిక్ ఆమ్లంతో..
రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించే కరోనా వైరస్ ప్రొటీన్ కోసం జన్యు సంకేతాలను(డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ రూపాల్లో) వినియోగించుకోవటంపై కనీసం 20 బృందాలు పనిచేస్తున్నాయి. మానవుల కణాల్లోకి న్యూక్లిక్ ఆమ్లాన్ని జొప్పిస్తారు. ఇలాంటి టీకాలు చాలావరకు వైరస్ ముళ్ల ప్రొటీన్‌తోనే సంక్షేపితమై ఉంటాయి. వీటిని రూపొందించటానికి వైరస్‌లు అవసరం లేదు. జన్యు పదార్థముంటే చాలు. కానీ ఇవి నిరూపితమైనవి కావు.
- కణంలోకి డీఎన్‌ఏ మరింత ఎక్కువగా చేరుకునేలా ఎలక్ట్రోపోరటేషన్ ప్రక్రియ ద్వారా పైపొరకు రంధ్రాలు చేస్తారు.
- ఆర్‌ఎన్‌ఏ చుట్టూ కొవ్వు పొర రక్షణగా ఉంటుంది. కణంలోకి ప్రవేశించగలిగేది ఇదే.
- న్యూక్లిక్ ఆమ్లాల ఆధారంగా చేసే టీకాలు సురక్షితమైనవి. వేగంగా అభివృద్ధి చేయొచ్చు.
- రోగ నిరోధక ప్రతిస్పందనను అదుపు చేయాలి.
- అభివృద్ధి చేస్తున్న టీకాల సంఖ్య: 25
వైరల్- రోగవాహక టీకాలు
వైరల్- రోగవాహక టీకాలను తయారుచేస్తున్నట్టు 25 సంస్థలు చెబుతున్నాయి. మన ఒంట్లో కరోనా వైరస్ ప్రొటీన్లను పుట్టించేలా మీజిల్స్ లేదా అడినోవైరస్ లాంటి వాటిని జన్యుపరంగా మార్చటం ఇందులో కీలకాంశం. ఈ వైరస్‌లను బలహీనపరుస్తారు కాబట్టి జబ్బును కలగజేయవు. వీటిలో రెండు రకాలున్నాయి.
వృద్ధిచెందే వైరల్ రోగ వాహకం
ఇటీవల అభివృద్ధి చేసిన ఎబోలా టీకా దీనికి మంచి ఉదాహరణ. దీనిలోని వైరస్ కణాల్లో వృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాలు సురక్షితమైనవి. కాకపోతే ఇప్పటికే వీటిల్లోని వైరస్‌లను ఎదుర్కొనే శక్తి మన రోగనిరోధక వ్యవస్థకు ఉంటే టీకాల సామర్థ్యం తగ్గుతుంది.