కొవిడ్-19 సోకిన కొందరు రోగుల్లో రోగ నిరోధక వ్యవస్థ మితిమీరి జోక్యం చేసుకోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వ్యవస్థను తాత్కాలికంగా అదుపులో ఉంచేందుకు ప్రారంభ దశలోనే ఔషధాలను ఇవ్వాలని సూచించారు. దీనివల్ల వ్యాధి లక్షణాల తీవ్రత తగ్గుతుందని తెలిపారు. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మానవ శరీరంలో రోగ నిరోధక స్పందనలు రెండు అంచెల్లో ఉంటాయి. వీటిలో మొదటిది సహజసిద్ధ స్పందన కాగా.. రెండోది అడాప్టివ్ స్పందన. శరీరంలో ఇన్‌ఫెక్షన్ మొదలైన వెంటనే మొదటి అంచె క్రియాశీలమవుతుంది. వైరస్‌ను, దాని ఇన్‌ఫెక్షన్‌కు లోనైన కణాలను చంపేస్తుంది. రెండో అంచె మాత్రం వైరస్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించి, కొద్ది రోజుల తర్వాత క్రియాశీలమవుతుంది.
‘స్పందన’ను అదుపులో పెడితే వైరస్‌ను కట్టడి చేసినట్లే - రోగ నిరోధన శక్తి కరోనా
రోగ నిరోధక వ్యవస్థను అదుపులో ఉంచాలని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచించారు. కరోనా వైరస్ సోకిన రోగుల్లో రోగ నిరోధక వ్యవస్థ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని తమ పరిశోధనలో గుర్తించినట్టు పేర్కొన్నారు.
ఫ్లూ సోకిన రోగులతో పోలిస్తే కొవిడ్-19 బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థ స్పందన తీరు ఎలా ఉంటుందన్నది ఒక గణిత నమూనా సాయంతో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం.. ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎగువ శ్వాసకోశ వ్యవస్థలోని కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది. రెండు మూడు రోజుల్లోనే లక్షిత కణాలను చంపేస్తుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చేయడానికి ఈ వైరస్‌కు కొత్తగా ఎలాంటి కణాలు అందుబాటులో ఉండవు. అడాప్టివ్ వ్యవస్థ క్రియాశీలం కావడానికి ముందే ఈ దశలో సహజసిద్ద రోగ నిరోధక వ్యవస్థ.. శరీరంలోని ఫ్లూ వైరస్‌లను పూర్తిగా తొలగించేస్తుంది. కొవిడ్-19లో మాత్రం ఈ వ్యాధి కారక వైరస్.. ఊపిరితిత్తులు సహా శ్వాస కోశ వ్యవస్థకు సంబంధించిన ఉపరితల కణాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే దీని వ్యాప్తి చాలా నెమ్మదిగా ఉంటుంది. సరాసరిన ఆరు రోజుల పాటు లక్షణాలేవీ బయటపడవు. ఇందులో లక్షిత కణాల సంఖ్య తగ్గిపోవడానికి ముందే అడాప్టివ్ రోగ నిరోధక వ్యవస్థ రంగ ప్రవేశం చేస్తోంది. ఇన్‌ఫెక్షన్‌ను నెమ్మదింపచేస్తోంది. ఈ క్రమంలో.. చాలా వేగంగా వైరస్‌ను నిర్మూలించే సామర్థ్యమున్న సహజ రోగ నిరోధక వ్యవస్థ పనితీరులో అడాప్టివ్ వ్యవస్థ జోక్యం చేసుకొని నష్టం కలిగిస్తోంది. ‘‘సహజ, అడాప్టివ్ స్పందన వ్యవస్థలు కలిసి పనిచేయడం వల్ల తాత్కాలికంగా వైరస్ స్థాయి తగ్గుతుంది. అయితే వైరస్ పూర్తిగా నిర్మూలన కావడంలేదు. దీంతో వ్యాధి మళ్లీ ముదురుతోంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న వెయిమింగ్ యువాన్ చెప్పారు. ఈ నేపథ్యంలో రోగులకు మొదటే రోగ నిరోధక శక్తిని అదుపు చేసే మందులను ఇస్తే.. అడాప్టివ్ రోగ నిరోధక వ్యవస్థ స్పందనలో జాప్యం జరుగుతుందని తెలిపారు. తద్వారా వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్‌కు లోనైన కణాలను వేగంగా నిర్మూలించడానికి వీలవుతుందని చెప్పారు.
ఇదీ చూడండి:-కరోనా చికిత్సకు తొలి అడుగు- యాంటీబాడీ గుర్తింపు!