తెలంగాణ

telangana

ETV Bharat / international

భూతాపంపై విద్యార్థి లోకం గర్జన

భూతాపం, వాతావరణ మార్పులపై పోరుకు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి లోకం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో విఫలమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వందకు పైగా దేశాల్లో నిరసనలు చేపట్టారు విద్యార్థులు. తక్షణ చర్యలు అవసరమని డిమాండ్​ చేశారు.

వాతావరణ మార్పులపై పోరుకు కదిలిన విద్యార్థి లోకం

By

Published : Mar 16, 2019, 2:53 PM IST

వాతావరణ మార్పులపై పోరుకు కదిలిన విద్యార్థి లోకం
భూతాపం, వాతావరణ మార్పులపై ప్రభుత్వాల తీరుకు నిరసనగా విద్యార్థి లోకం కదం తొక్కింది. దక్షిణ పసిఫిక్​ మొదలుకొని ఆర్కిటిక్​ సర్కిల్​ అంచుల వరకు వందకు పైగా దేశాల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగానూ విద్యార్థులు గళం విప్పారు. పర్యావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరమని డిమాండ్​ చేశారు.

వాతావరణ మార్పులపై గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలోని విద్యార్థులు నిరసనలు తెలిపారు. ఈ భారీ స్పందనను చూస్తే పర్యావరణ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అమెరికా రాజధాని వాషింగ్టన్​లో " (వి డోంట్​ వాంట్​ టూ డై!) మేము మరణించాలనుకోవట్లేదు" అనే నినాదంతో నిరసనలు చేపట్టారు. శ్వేతసౌధం ముందు బైఠాయించారు విద్యార్థులు. పునరుత్పాదక శక్తిపై ప్రభుత్వాలు వంద శాతం దృష్టి సారించాలని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని నినదించారు.

అమెరికా, బ్రిటన్​, చిలీ, ఫ్రాన్స్​, బెల్జియం, స్విట్జర్లాండ్​, ఇటలీ, ఇండోనేషియా, జర్మనీ, హాంగ్​కాంగ్​, కెన్యా దేశాల్లోనూ విద్యార్థులు నిరసన బాటపట్టారు. ఆందోళనల్లో భాగంగా రోడ్లపై నృత్యాలు చేశారు. 'మన ఇంటిని రక్షించుకుందాం' అంటూ నినాదాలు చేశారు.

" మనం రాబోయే తరం ఓటర్లం. వాతవరణ మార్పుల ప్రభావంపై పోరాడేందుకు నడుం బిగించాలి. వేరే అవకాశం లేదు, మన తరం మార్పు తీసుకొస్తుంది. చూస్తూ ఊరుకునే కాలం ముగిసింది. పోరాడాల్సిన సమయం వచ్చింది. వాతావరణ మార్పుపై ప్రపంచ వ్యాప్తంగా చేపట్టే చర్యలకు ముందుండి నడవాల్సిన తరం మనదే" - అలిస్సా వేయిస్​మాన్​, మేరీలాండ్​ హైస్కూల్​ విద్యార్థిని, వాషింగ్టన్​

భూమిపై గ్రీన్​హౌస్​ గ్యాస్​ ఉద్గారాల స్థాయిపై శాస్త్రవేత్తలు దశాబ్ద కాలం క్రితమే హెచ్చరించారు. 2015లో ప్రపంచ నాయకులు భూతాపంపై ప్యారిస్​లో ఒప్పందం చేసుకున్నారు. సుమారు 2 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు తగ్గించడానికి చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కానీ అప్పటి నుంచి నేటి వరకు సుమారు 1 డిగ్రీ సెల్సియస్​ ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరో నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details