హానికర, విద్వేషపూరిత వీడియో సందేశాలను కట్టడి చేయాలని ఫేస్బుక్ భావిస్తోంది. లైవ్ స్ట్రీమింగ్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనలో సంస్థ తెలిపింది. ఇందుకోసం 'వన్ స్ట్రయిక్' విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. నియమాలను అతిక్రమించి ఎవరికైనా హాని తలపెట్టేలా లైవ్ ప్రసారం ఒక్కసారి చేసినా వారికి ఆ సదుపాయాన్ని పూర్తిగా నిలిపివేయనుంది.
ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ప్రకటనలు షేర్ చేసిన వారికీ వన్-స్ట్రయిక్ నిబంధన వర్తిస్తుంది.
ఇటీవల న్యూజిలాండ్ మసీదులపై జరిగిన దాడుల అనంతరం కొందరు విద్వేషాన్ని వ్యాప్తి చేసే వీడియోలను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేశారు. అలాంటి సందేశాలను నియంత్రించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికారి గయ్ రోసెన్ తెలిపారు. న్యూజిలాండ్ ఘటనకు సంబంధించి ఎడిటెడ్ వీడియోలను గుర్తించడంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయన్నారు. ఈ సవాలును అధిగమించేందుకు 7.5 మిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాలోని మూడు యూనివర్సిటీలతో ఫొటో, వీడియో విశ్లేషణ సాంకేతికపై పరిశోధనలు నిర్వహిస్తోంది ఫేస్బుక్.