తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2020, 2:28 PM IST

ETV Bharat / international

ఇప్పుడు ఓన్లీ చాటింగ్- అసలు పని కరోనా తర్వాతే!

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో వారికి, ముఖ్యంగా యువతకు డేటింగ్ సైట్లు మంచి కాలక్షేపంగా మారాయి. కొత్త వారితో పరిచయాలు పెంచుకునేందుకు ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా సంక్షోభం ముగిసిన తర్వాతే వీరు డేట్​కు వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కబుర్లతోనే కాలక్షేపం!

Dating
అసలు పని కరోనా తర్వాతే

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా లాక్​డౌన్ లో ఉంది. ప్రభుత్వ ఆంక్షలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. యువతతోపాటు ఉద్యోగులు ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ఈ సమయంలో సామాజిక మాధ్యమాలు, డేటింగ్ సైట్లలో కొత్తవారితో పరిచయాలు వారికి ఊరటనిస్తున్నాయి.

అమెరికా వంటి దేశాల్లో డేటింగ్ సైట్స్ వినియోగం భారీగా పెరుగుతోంది. కొత్తవారితో పరిచయాల కోసం ఈ ఖాళీ సమయాన్ని వినియోగిస్తున్నారు.

అమెరికాలో ఒకరినొకరు తెలుసుకునేందుకు డేటింగ్​కు ప్రాధాన్యమిస్తారు. తొలుత ఆన్​లైన్​లో చాటింగ్.. ఆ తర్వాత డేటింగ్​తో దగ్గరవుతారు. ఇందుకోసం అనేక సైట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుత కరోనా కాలంలో చాటింగ్ వరకు ఇబ్బంది లేకున్నా... ప్రత్యక్షంగా కలవటం కష్టమే. ఈ మహమ్మారి ప్రపంచాన్ని వీడిన తర్వాతే కొత్త జంటల కాళ్లకు కళ్లెం తొలిగేది.

భిన్నాభిప్రాయాలు..

ప్రస్తుత పరిస్థితుల వల్ల "డేటింగ్ సైట్లు మూసేసే సమయం వచ్చింది. కరోనా సంక్షోభం వీడే వరకు కొత్తవారితో ఆన్​లైన్​ సంబంధాలు మరిచిపోవాల్సిందే" అంటూ ఓ జోక్ ప్రచారంలోకి వచ్చింది. అయితే యువతుల ఆలోచన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇది తమకు ఓ ప్రత్యేక అవకాశంగా భావిస్తున్నారు. ఎదుటివారి గురించి సరైన అవగాహనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

"నచ్చిన వారిని కలవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే మన భద్రత విషయంలోనూ నమ్మకం కలగాలి. ఇంతకు ముందు అబ్బాయిలు కాసేపు చాట్ చేసి వీలైనంత త్వరగా కలవాలనే ప్రతిపాదన తెచ్చేవారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవకాశం లేదు. వాళ్లు బలవంతంగా అయినా చాట్ చేయాల్సి వస్తోంది. ఇది మంచి పరిణామం. ప్రస్తుతం టిండర్ లైవ్ లో ఓ వ్యక్తితో మాట్లాడుతున్నా. మా కబుర్లన్నీ ఎక్కువగా కరోనాపైనే. మన జీవితాలను ఈ మహమ్మారి ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని చర్చిస్తున్నాం."

-లేన్ మూరే, రచయిత్రి, న్యూయార్క్

కొత్త అవకాశం..

ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు డేటింగ్ యాప్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. యాప్​లో ఎక్కువ సమయం వెచ్చించేందుకు కొత్త ఆప్షన్లను అందిస్తున్నాయి. టిండర్, ఓకే క్యూపిడ్, కాఫీ మీట్స్ బగెల్ (సీఎంబీ), ఓకే జూమర్ వంటి ప్రముఖ సైట్లు వీడియో కాలింగ్, బృంద చర్చలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. అంతేకాదు.. ప్రత్యక్షంగా కలవద్దని హెచ్చరిస్తున్నాయి.

"సామాజిక దూరం కారణంగా కబుర్లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కొత్త వారితో పాటు పాత స్నేహితులతోనూ సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. డేటింగ్ సైట్లు కూడా ప్రత్యక్షంగా కలుసుకోవటం కాకుండా పరిచయాలు, ముచ్చట్లకే ప్రాముఖ్యం ఇస్తున్నాయి. ఉదాహరణకు ఓకే జూమర్​లో ప్రాక్సిమిటీకి (ఎవరు మనకు దగ్గరగా ఉన్నారో తెలుసుకునే వీలు) అనుమతి ఇవ్వటం లేదు. ఫలితంగా అర్థవంతమైన సంభాషణలకు ఇవి వేదికగా మారాయి."

-ఇలియానా, యేల్ విశ్వవిద్యాలయం విద్యార్థిని

మార్పు పరిమితమే..

అయితే కరోనా వైరస్ వల్ల వచ్చిన ప్రస్తుత మార్పులు డేటింగ్ సైట్లలో కొత్త విప్లవానికి నాంది పలుకుతాయనే నమ్మకం లేదని మూరే అంటున్నారు.

"డేటింగ్ సైట్లు కొత్త నినాదాలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కలిసి క్వారంటైన్ లో ఉందాం, దూరంగా ఉన్నా దగ్గరవుదాం వంటి ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఇది డేటింగ్​లో కొత్త మార్పులు తీసుకొస్తాయని నేను భావించటం లేదు. పరిస్థితులన్నీ చక్కబడితే మళ్లీ మొదటికే వస్తాయి. మాట్లాడటానికి ఇష్టపడని వాళ్లు ఒక్క పదంతోనే సంభాషణలు ముగిస్తారు. అప్పుడే నిజమైన వ్యక్తులను మనం గుర్తించవచ్చు."

-లీన్ మూరే, రచయిత్రి, న్యూయార్క్

చివరగా..

పెరుగుతున్న కొత్త పరిచయాలతో ఇప్పుడు కలిసేందుకు ప్రస్తుతం వీలు లేకపోయినా.. కరోనా సంక్షోభం సమసిపోతే ఆ బాధ తీరుతుందని భావిస్తోంది యువత. పరిస్థితులు చక్కబడేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. అప్పటి వరకు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉందని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details