కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. వైరస్ సోకిన వారిపై మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ మంచి ప్రభావం చూపుతోందని కొందరు వైద్యులు విశ్వసిస్తున్నారు. అయితే.. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు యాంటిబయోటిక్ అజిత్రోమైసిన్ను వినియోగిస్తే గుండెకు ముప్పు పెరుగుతుందని ఓ నివేదిక హెచ్చరిస్తోంది. ఈ ఔషధాలను వినియోగించే క్రమంలో జాగ్రత్తలు వహించాలని.. లేదంటే హృదయ స్పందనల్లో ఇబ్బందులు తలెత్తుతాయని వెల్లడించింది.
అమెరికా న్యూయార్క్‌లోని కార్డియాలజీ కళాశాలకు చెందిన మాగజైన్లో ఈ పరిశోధన ప్రచురితమైంది. ఒరెగావ్ హెల్త్ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయం(ఓహెచ్‌ఎస్‌యూ), ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన కార్డియాలజిస్టులు.. హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ వాడకాలపై పరిశోధన చేశారు. కొవిడ్-19 రోగులకు మలేరియా-యాంటిబయోటిక్ మందుల కలయికతో చికిత్స అందిస్తున్న వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ 2 మందుల్ని కలిపి ఉపయోగిస్తే గుండె గదులు మూసుకుపోవటం, సక్రమంగా కొట్టుకోకపోవటం లేదా కొన్ని సందర్భాల్లో ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
" కొవిడ్-19 చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ప్రభావం చూపుతున్నాయనే దానిపై ప్రస్తుతానికి చాలా తక్కువ సమాచారం ఉంది. అయినప్పటికీ.. కొంతమంది వైద్యులు కరోనా చికిత్సకు వీటిని ఉపయోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. కరోనా రోగులకు ఈ ఔషధాలను వినియోగించాలనుకునే వైద్యులు వాటి దుష్ప్రభావాలను తెలుసుకోవాలని కోరుతున్నాం. "
- ఎరిక్ స్టెక్కెర్, ఓహెచ్‌ఎస్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్