'థాంక్స్ గివింగ్ డే' సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్షమాభిక్ష పెడితే అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.. కానీ, ఆ తర్వాత కూడా ఆయన క్షమాభిక్షల పరంపరను కొనసాగిస్తున్నారు. తన పదవీకాలం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో ఆయనలో కరుణ రసం పొంగిపొర్లుతోంది. దీంతో రెండు రోజుల్లో 41 మందికి క్షమాభిక్షలు ప్రసాదించారు. వైట్‌హౌస్‌ను వీడేలోపు ఇల్లు చక్కదిద్దుకొనే పనిలో పడ్డారు. తన ఆప్తులు.. సొంతపార్టీ వ్యక్తులు, అనుచరులు.. కుటుంబ సభ్యులకు వరుసగా క్షమాభిక్షలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈ జాబితాలో రష్యన్ గేట్ అనుమానితులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన వారు.. ఇవాంక ట్రంప్ మామ వంటి వారు ఉన్నారు. ట్రంప్ వ్యవహారశైలితో.. అధ్యక్షుడి క్షమాభిక్ష అధికారంపై అమెరికాలో చర్చకు తెరలేచింది.
అసలు ఈ క్షమాభిక్షల అధికారం ఏమిటి?
అమెరికా చట్టాలను అతిక్రమించిన వారిని, దేశంలో నేరాలు చేసిన వారిని క్షమించే అధికారం ఆ దేశాధ్యక్షుడికి ఉంది. ఈ విషయాన్ని అక్కడి సుప్రీం కోర్టు ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా కాంగ్రెస్ కూడా ఆయన్ను ఏమీ చేయలేదు. ఈ విషయంలో అధ్యక్షుడు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. కనీసం కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
అభిసంశనకు గురైన అధికారులు మాత్రం ఈ క్షమాభిక్షకు అనర్హులు. అమెరికాలో ఫెడరల్ చట్టాల పరిధిలో నేరాలకు క్షమాభిక్ష ఇవ్వొచ్చు కానీ.. అక్కడి రాష్ట్రాల పరిధిలోని చట్టాల్లో ప్రస్తావించిన నేరాలకు పాల్పడిన వారికి మాత్రం వర్తించదు.
ఇప్పుడే ఈ హడావుడి ఎందుకు?
2016 ఎన్నికల్లో ఓటమికి రష్యన్లు ట్రంప్‌నకు సాయం చేశారని డెమొక్రాట్లు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో బైడెన్ అధికారం చేపట్టగానే 'రష్యా జోక్యం'పై విచారణను వేగవంతం చేస్తారన్నది ట్రంప్ అనుమానం. ఇది నిజమైతే ఆయన మాజీ సలహాదారు రోజర్ స్టోన్, ప్రచార విభాగం అధ్యక్షుడు పాల్ మ్యాన్‌ఫోర్ట్ వంటి వారితో పాటు.. తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జరేడ్ కుష్నెర్ వంటి వారిపై దర్యాప్తులు వేగవంతమవుతాయి. అంతిమంగా అవి తన దాకా వస్తాయని ట్రంప్ భయపడుతున్నారు. అంతే కాదు పిల్లలు ఎరిక్ ట్రంప్, ఇవాంక ట్రంప్‌లతో పాటు.. తన న్యాయసలహాదారుడు రూడీ గులియాని వంటి వారిని బైడెన్ సర్కార్ లక్ష్యంగా చేసుకుంటుందని భయపడుతున్నారు. ఇప్పటికే మెన్‌ఫోర్ట్, స్టోన్‌లతోపాటు అల్లుడు కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్‌కు కూడా క్షమాభిక్షను ఇచ్చేశారు. బ్లాక్ వాటర్స్ అనే అమెరికా కిరాయి సైన్యంలోని సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ముందస్తు క్షమాభిక్షలు కూడా!