తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2021, 9:58 AM IST

ETV Bharat / international

జాతి ఐక్యతా ప్రసంగానికి ముందు బైడెన్​​ భావోద్వేగం

అగ్రరాజ్య అధ్యక్షుడిగా బైడెన్​ మరికొద్ది గంటల్లో ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం ఆయన తన సొంత రాష్ట్రమైన డెలావేర్​ నుంచి బయలుదేరారు. ప్రమాణ స్వీకార అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన 20 నుంచి 30 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. అంతకుముందు డెలావేర్​లో నిర్వహించిన సభలో ప్రసంగిస్తూ బైడెన్​ భావోద్వేగానికి గురయ్యారు.

biden inauguration speech
జాతి ఐక్యతా ప్రసంగం ముందు సొంతూరిలో బైడెన్​​ భావోద్వేగం

అమెరికా 46 వ అధ్యక్షుడిగా.. జో బైడెన్ బుధవారం‌ ప్రమాణస్వీకారం చేసిన తరువాత జాతి ఐక్యతా ప్రసంగం చేయనున్నారు. కరోనా మహమ్మారి సహా ఆర్థిక సంక్షోభ తరుణంలో.. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరంపై జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. ఈ మేరకు బైడెన్​ సలహాదారులు తెలిపారు.

అమెరికా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్‌.. జోబైడెన్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో బైడెన్​ ప్రసంగం ఉంటుందని ఆయన సలహాదారులు చెప్పారు.

జో బైడెన్‌ ప్రసంగ రచయితగా ఇండియన్‌ అమెరికన్‌ వినయ్‌ రెడ్డి ఉన్నారు. 2013 నుంచి 2017 మధ్య ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా.. వినయ్‌ రెడ్డినే ఆయన ప్రసంగ రచయితగా ఉన్నారు. అయితే ఒక భారతీయ అమెరికన్‌.. అమెరికా అధ్యక్షుడికి ప్రసంగాన్ని రచించడం ఇదే మొదటిసారి.

డెలావేర్​లో బైడెన్ భావోద్వేగం..​

డెలావేర్​లోని తన సొంతూరు నుంచి ప్రమాణ స్వీకారం కోసం.. ప్రైవేట్​ విమానంలో వాషింగ్టన్​ డీసీకి బయలుదేరారు బైడెన్​. అంతకుముందు అక్కడి ప్రజలనుద్దేశించి బైడెన్ ప్రసంగించారు. డెలావేర్​ రాష్ట్ర పౌరుడిని అయనందుకు తాను ఎప్పుడూ గర్వంగా భావిస్తానని చెప్పారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి గురై.. కన్నీరు కార్చారు.

తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినా.. డెలావేర్‌ రాష్ట్రానికి కుమారుడిగా ఉంటానని తెలిపారు. తాను చనిపోయినప్పుడూ తన హృదయంలో డెలావరే రాసి ఉంటుందన్నారు. వాషింగ్టన్‌కు తమ తదుపరి ప్రయాణం ఇక్కడి నుంచి మెుదలవుతోందన్నారు.

జాతి ఐక్యతా ప్రసంగం ముందు సొంతూరిలో బైడెన్​​ భావోద్వేగం

"నాలాగే మీ(డెలావేర్​ రాష్ట్ర ప్రజలు) అందరూ భావోద్వేగానికి గురవుతారు. నా మంచి, చెడు సందర్భాల్లో మీరు నాకు తోడుగా ఉన్నారు. అందుకు మీకు నా కృతజ్ఞతలు. బైడెన్​ కుటుంబం తరఫున మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మా కుటుంబంలో మేము నమ్మే విలువలు, విశ్వాసాలు అన్నీ ఇక్కడ నుంచి అలవడినవే."

--జో బైడెన్​

1973లో డెలావేర్​ నుంచి సెనెటర్​గా బైడెన్ ఎన్నికై.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ​

1,91,500 అమెరికా జెండాలతో..

అమెరికాలోని నేషనల్​ మాల్​ వద్ద ఏర్పాటు చేసిన జెండాలు, లైట్లు
అమెరికాలోని నేషనల్​ మాల్​ వద్ద ఏర్పాటు చేసిన జెండాలు, లైట్లు

191,500 అమెరికా జెండాలను, 56 కాంతి స్తంభాలను అమెరికాలోని నేషనల్​ మాల్​ వద్ద ఏర్పాటు చేశారు. కొవిడ్​ నిబంధనల వల్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేని అమెరికన్ల గౌరవార్థం.. వీటిని అక్కడ సిద్ధం చేశారు. ఫీల్డ్​ ఆఫ్​ ఫ్లాగ్స్​గా వీటిని పిలుస్తున్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details