కరోనా వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. అయితే.. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు మంత్రినీ వదల్లేదు అధికారులు. తన మిత్రుల ఇంట్లో భోజనం చేసిన ఆ దేశ ప్రసార, సాంకేతిక శాఖ మంత్రి స్టెల్లా ఎందబెని-అబ్రహమ్స్ను సస్పెండ్ చేశారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 'స్టే ఎట్ హోమ్' ఆర్డర్లో భాగంగా ప్రత్యేక సెలవుల్లో ఉన్నారు అబ్రహమ్స్. అయితే, లాక్‌డౌన్ రెండో వారంలో ఆమె.. మాజీ మంత్రి ఇంట్లో భోజనం చేయడమే కాక ఆ చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ ఫొటోను చూసిన అధికారులు.. నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా మంత్రిని సస్పెండ్ చేయడమే కాకుండా, సుమారు 1000 ర్యాండ్ల( సుమారు 53 డాలర్లు) జరిమానా విధించారు. వచ్చే నెలలో కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.
3000లకుపైగా కేసులు..
దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 3,465 మంది కరోనా మహమ్మారి బారినపడగా.. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి కొద్ది వారాల క్రితమే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది దక్షిణాఫ్రికా.