తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మా జీవితంలో భయంకరమైన టైమ్​ అది.. గౌతమ్​ ఇప్పుడు ఇలా ఉన్నాడంటే వారే కారణం'

టాలీవుడ్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు మహేశ్‌బాబు, నమ్రత.  ఈ ఏడాదితో వీరిద్దరూ వివాహం చేసుకుని 17 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నమ్రత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ వైవాహిక బంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే..

mahesh babu wife namrath about her son gautam birth
mahesh babu wife namrath about her son gautam birth

By

Published : Dec 18, 2022, 2:23 PM IST

వైవాహిక బంధం సజావుగా సాగాలంటే భార్యాభర్తలిద్దరి మధ్య నమ్మకం ఉండాలని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సతీమణి నమ్రత అన్నారు. మహేశ్‌తో తన జీవితం ఇంత ఆనందంగా ఉండటానికి కారణమదేనని ఆమె చెప్పారు. "ఇద్దరి వ్యక్తుల మధ్య నమ్మకం ఉంటే ఏ బంధమైనా సంతోషంగా సాగుతుంది. మహేశ్‌తో నా వివాహమై 17 ఏళ్లు అవుతుంది. పెళ్లి కాకముందు మేమిద్దరం మంచి స్నేహితులం. అన్ని విషయాలు పంచుకునే వాళ్లం. మా మధ్య రహస్యాలు, అనుమానాలు, అపనమ్మకాలకు చోటు లేదు. ఒకవేళ ఆయన ఎప్పుడైనా బయటకు వెళ్తే.. ఎక్కడికి వెళ్లావు? ఎవరితో ఉన్నావు? ఏం చేస్తున్నావు? అని పదిసార్లు ఫోన్లు చేసి విసిగించను, అనుమానించను. ఆయన కూడా అంతే"

"గౌతమ్‌-సితార పుట్టిన తర్వాత మా జీవితం ఎంతో మారిపోయింది. ఒక తల్లిగా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నా. గౌతమ్‌ పుట్టినరోజుని మేము ఎప్పటికీ మర్చిపోలేం. అది మా జీవితాల్లో ఓ భయానకమైన సమయం. ఏడో నెలలో చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లాను. బాబు పేగు మెడలో వేసుకున్నాడని, ఊపిరి తీసుకోలేకపోతున్నాడని, హార్ట్‌ బీట్‌ సరిగా లేదని వైద్యులు చెప్పారు. మహేశ్‌కు ఫోన్‌ చేశారు. అదృష్టం కొద్ది ఆయన హైదరాబాద్‌లోనే ఫిలింసిటీలో ఒక షూట్‌లో ఉన్నారు. వెంటనే ఆయన ఆస్పత్రికి వచ్చేశారు. సర్జరీ చేసి బాబును బయటకు తీశారు. అప్పుడు వాడు 1.5 కేజీలు మాత్రమే ఉన్నాడు. బాబు విషయంలో మేము ఏం చెప్పలేమని వైద్యులు మహేశ్‌కు ముందే చెప్పేశారు. మూడు వారాలపాటు బాబుని వైద్యుల సంరక్షణలోనే ఉంచాం. రోజుకి కేవలం 40 గ్రాములు మాత్రమే పాలు పట్టించాలని, ప్రతిరోజూ వాడు 10 గ్రాముల బరువు పెరగాలని వాళ్లు సూచించారు. మేము రోజూ నిద్రపోయే ముందు వాడు బరువు పెరగాలని దేవుడ్ని కోరుకునేవాళ్లం. గౌతమ్‌ ఇప్పుడు ఇలా ఉన్నాడంటే దానికి వైద్యులే కారణం" అని ఆమె వివరించారు.

ABOUT THE AUTHOR

...view details