చోర్ బజార్ అనేది వాస్తవానికి ఒక అద్భుతమైన రంగుల ప్రపంచమని అన్నారు దర్శకుడు జీవన్ రెడ్డి. దానిని సినిమాగా ఎందుకు తీయకూడదు అనే ఆలోచనతోనే 'చోర్ బజార్' తెరకెక్కించినట్లు తెలిపారు. 'దళం', 'జార్జి రెడ్డి' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. యువ నటుడు ఆకాష్ పూరి, గెహనా సిప్పీ ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కించిన చిత్రం 'చోర్ బజార్'. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించిన జీవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ చిత్రం 'చోర్ బజార్'. అందరూ మనుషులే అయినా చోర్ బజార్లోని వ్యక్తులు ఎందుకు విభిన్నంగా ఉంటారు? అనే ప్రశ్న నుంచి ఈ కథ పుట్టింది. అక్కడి వ్యక్తుల జీవన విధానం, సంఘటనలే నా కథా వస్తువు. ఒక రకంగా చెప్పాలంటే మనకన్నా విలువలున్నవారు చోర్బజార్లోని వ్యక్తులు. మనం వ్యాపారం కోసం చేస్తే వారు అవసరం కోసం చేస్తారు. అదే పని వారు ఎదగడానికి చేస్తే.. వారి స్థాయి మాములుగా ఉండదు"
-జీవన్ రెడ్డి, దర్శకుడు