తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఈజీ మనీ కోసం.. ఆన్​లైన్ బెట్టింగ్​ మాయలో పడుతున్న యువత

ఆన్‌లైన్ బెట్టింగ్‌... సులువుగా డబ్బు సంపాదించటానికి ఇదొక మార్గం. ఇందుకు ఎన్నో యాప్స్‌, వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటికి ఆకర్షితులై యవత లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు కన్నవారిని కడతేరుస్తున్నారు.

youth are attracted to online bettings
ఈజీ మనీ కోసం.. ఆన్​లైన్ బెట్టింగ్​

By

Published : Jan 21, 2021, 7:07 AM IST

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సులువుగా డబ్బులు సంపాందించాలని బానిసలు అవుతున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. 2 నెలల క్రితం వనస్థలీపురానికి చెందిన ఓ ల్యాబ్ టెక్నిషియన్ ఆన్‌లైన్‌ బెట్టింగ్స్‌కు బానిసై రూ.12లక్షలు నష్టపోయాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. వాటిని అతడి తండ్రి తీర్చగా.... పోగొట్టుకున్న సొమ్ము సంపాదించాలనుకొని.... మళ్లీ బెట్టింగ్ వేశాడు. ఆ డబ్బులూ పోవటంతో.... మనస్తాపానికి గురై సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకొని అప్పులు తీర్చలేక బలవన్మరణం చేసుకున్నాడు. చైతన్యనగర్‌కు చెందిన రవికుమార్... బెంగళూరు ఇన్‌ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కాలంలో తరచూ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతూ అప్పుల పాలయ్యాడు. గమనించిన తండ్రి లక్ష రూపాయలు తీర్చాడు. మరికొన్ని అప్పులు ఉండటంతో మనస్తాపం చెంది ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మేడ్చల్ జిల్లా రావల్ కోల్‌కు చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌లకు బానిసై తల్లి, చెల్లిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. బెట్టింగ్‌ సొమ్ముకు అడ్డుగా ఉన్నారని అన్నంలో విషం పెట్టి హతమార్చాడు. కూతురు పెళ్లి కోసం 20 లక్షలు తల్లి దాచగా... ఆ సొమ్ము తీసుకునేందుకు వారిని పథకం ప్రకారం చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇలాంటి వరుస ఘటనలతో పోలీసులు బెట్టింగ్ సైట్లపై నిఘా పెట్టారు. బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పలు సైట్లు, యాప్స్‌పై నిషేధం విధిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details