Volunteer Murder: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మారిస్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు.. వాలంటీరుపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారిస్‌పేటలోని 24వ వార్డులో వాలంటీర్ గా సందీప్(22) పనిచేస్తున్నాడు. రోహిత్ అనే వ్యక్తికి సందీప్ రూ. 2 వేలు ఇచ్చాడు. కొన్ని రోజులకు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని సందీప్ అడిగాడు.
దీంతో.. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే.. రోహిత్ తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సందీప్‌పై దాడిచేశారు. గుండెపై బలంగా కొట్టడంతో సందీప్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోహిత్, అతని తండ్రి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. సందీప్ తండ్రి ఇది వరకే మృతిచెందగా, తల్లికి మాటలు రావు. దీంతో.. వాలంటీర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.