తెలంగాణ

telangana

ETV Bharat / crime

PODU: పదేళ్లుగా సాగు చేసుకుంటున్నాం... ఇప్పుడు మీదంటే ఎలా? - ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న ఎస్సీలు

పది సంవత్సరాలుగా... 20 కుటుంబాలు సాగు చేసుకుంటున్న భూమిని... ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి అటవీశాఖదని చెబుతూ స్వాధీనం చేసుకోవడాన్ని ... ఎస్సీలు అడ్డుకున్నారు. తంగళ్లపల్లి మండలం గోపాల్​రావు పల్లి శివారులోని బొడ గుట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

forest officers
అధికారులను అడ్డుకున్నారు

By

Published : Jul 29, 2021, 12:04 PM IST

Updated : Jul 29, 2021, 1:53 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్​ రావు పల్లి శివారులోని బొడ గుట్ట వద్ద సాగుచేసుకుంటున్న సుమారు 40 ఎకరాల భూమిని ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్లతో దున్నుతుండగా ఎస్సీలు వారిని అడ్డుకున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు 2 ట్రాక్టర్లతో భూమిని దున్నిస్తున్న సమయంలో వారిని ఎస్సీలు అడ్డుకున్నారు.

అధికారులను అడ్డుకున్నారు

బోడ గుట్ట వద్ద 647 సర్వేనెంబర్​లో ఉన్న 40 ఎకరాల పంచ రాయి భూమిని... గ్రామానికి చెందిన దాదాపు 20 కుటుంబాలు పది సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని వారు తెలిపారు. గ్రామంలోని కొందరు వ్యక్తులు ఈ భూమిపై ఫిర్యాదు చేయగా... కొన్ని రోజులుగా అధికారులు వచ్చి ఇది ఫారెస్ట్ భూమి అంటూ... మమ్మల్ని సాగు చేయనివ్వడం లేదని వాపోయారు. పట్టాల కోసం తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్​లను కలిసినా... పట్టాలు ఇవ్వలేదని తెలిపారు.

అప్పటి వరకు వదిలేది లేదు

ఈ భూమిపై అధికారులు విచారణ జరపాలని... ఫారెస్ట్ భూమి అని తేలితే భూమిని వదిలిపెడతామని... అంతవరకు వదిలిపెట్టేది లేదని వెల్లడించారు. మాకు సెంటు భూమి కూడా లేదని... ఈ భూమినే నమ్ముకొని జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కొంతమందికి సుమారు 98 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చారని... తమకు మాత్రం ఇచ్చేందుకు వెనుకాడుతున్నారంటూ ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.

ఇది ఫారెస్ట్ రిజర్వ్ భూమి అని... పెద్ద లింగాపూర్ బీట్ పరిధిలోకి వస్తుందని హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఇక్కడకు వచ్చామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భూలక్ష్మీ తెలిపారు. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకుని ప్రొబేషనరీ ఎస్సై సోమేశ్వర్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి.. ఫారెస్ట్ అధికారులతో, ఎస్సీలతో మాట్లాడగా గొడవ సద్దుమణిగింది.

ఇదీ చూడండి:PODU: పోడు భూముల ఘర్షణ.. గిరిజనులకు గాయాలు.!

Last Updated : Jul 29, 2021, 1:53 PM IST

ABOUT THE AUTHOR

...view details