Thadepalli Murder Case: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో గత నెల 25న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కట్టా రాజేంద్ర కేసును పోలీసులు ఛేదించారు. రాజేంద్ర ప్రియురాలు ఇందిర, ఆమె కుమారుడు వంశీ ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టా రాజేంద్ర.. తాడేపల్లి అంజిరెడ్డి కాలనీకి చెందిన ఇందిరతో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 26వ తేదీన రాజేంద్ర మద్యం మత్తులో డ్రైనేజి కాలువలో పడి మృతి చెందాడని ప్రియురాలు ఇందిర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శవపంచనామ చేసి మృతదేహాన్ని మెుదటి భార్యకు అప్పగించారు.
హత్య చేసి ఆపై
అయితే మెుదటి భార్య నుంచి రాజేంద్ర మృతదేహాన్ని ఇందిర బలవంతంగా తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసింది. భర్త రాజేంద్ర మృతిపై అనుమానం వ్యక్తం చేసిన మెుదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేంద్ర ప్రియురాలు ఇందిర, ఆమె కుమారుడు వంశీలను పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారని మంగళగిరి డీఎస్పీ రాంబాబు చెప్పారు. ఈ నెల 25వ తేదీ రాత్రి రాజేంద్ర, వంశీకి మధ్య ఘర్షణ జరగగా.. కూరగాయల కత్తితో రాజేంద్రను హత్య చేసి డ్రైనేజీ కాల్వలో పడేశారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Man Kills his Daughter in Law: కోడలిని గొంతు కోసి చంపిన మామ