కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో ఈనెల 4వ తేదీన కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారం పోలీసులకు వచ్చింది. వెంటనే ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడేవారిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో భూమాబోయిని పోలీసులు లాఠీలతో కొట్టారు. తీవ్రగాయాలపాలైన భూమాబోయిని స్పృహకోల్పోయినట్లు... అతని భార్య లక్ష్మమ్మ తెలిపింది.
పండుగ పూట పేకాట ఆడుతున్న వాళ్ల దగ్గరకి మా ఆయన వెళ్లాడు. అక్కడ ఆడుతున్న వాళ్లని చూస్తూ కుర్చొన్నాడు. అప్పుడే పోలీసులు వచ్చారు. వారి రాకతో పేకాట ఆడుతున్న వాళ్లు పారిపోయారు. అక్కడే ఉన్న మా ఆయనను పోలీసులు తీవ్రంగా కొట్టారు. వెంటనే చక్కర వచ్చి పడిపోయాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన మేము.. తనని ఇంటికి తీసుకెళ్లాం. పరిస్థితి దాటి పోతోందని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లాం. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మా ఆయన చనిపోయాడు.
-లచ్చవ్వ, మృతుడి భార్య
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు భూమబోయిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతూ భూమబోయి బుధవారం మృతిచెందాడు (Man Died). పోలీసులు కొట్టిన దెబ్బలతో చిన్న మెదడు నరాలపై ఒత్తిడి పెరిగి రక్తం గడ్డకట్టినట్లు సిటీ స్కాన్ రిపోర్ట్‌లో వచ్చిందని కుటుంబసభ్యులు వెల్లడించారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తమకు అనుకూలంగా సంతకాలు పెడితేనే పోస్టుమార్టం చేయిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. తన భర్త చావుకు కారణమైన బిచ్కుంద పోలీసులపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని లక్ష్మీభాయి డిమాండ్ చేశారు.