తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2022, 11:46 AM IST

ETV Bharat / crime

Cheater Arrest: లక్షతో రూ.కోట్లు కొట్టేశారు .. కోల్‌కతా దంపతుల ఘరానా మోసం

Cheater Arrest: తక్కువ పెట్టుబడులకు అధిక వడ్డీలు ఆశ చూపి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని సైబరాబాద్‌ ఆర్ధిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేసేందుకు మోసగాడు సంస్థను స్థాపించి మరో ఇద్దరితో కలిసి మోసాలకు పాల్పడ్డాడు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3500 మంది డిపాజిటర్ల వద్ద నుంచి సుమారు 70 కోట్ల రూపాయల మేర దండుకున్నట్టు దర్యాప్తులో తేలింది.

Cheater Arrest: లక్షతో రూ.కోట్లు కొట్టేశాడు .. కోల్‌కతా దంపతుల ఘరానా మోసం
Cheater Arrest: లక్షతో రూ.కోట్లు కొట్టేశాడు .. కోల్‌కతా దంపతుల ఘరానా మోసం

Cheater Arrest: అంకుర సంస్థతో ఎదగాలనుకున్నాడు. విఫలమై మోసాల బాటపట్టాడు. భార్య సహకారంతో రూ.కోట్లు కొల్లగొట్టాడు. అధికవడ్డీల ఆశచూపి భారీఎత్తున వసూళ్లకు పాల్పడిన జయంత్‌ బిశ్వాస్‌(49)ను సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న నిందితుడి భార్య మోసిమి బిశ్వాస్‌, ఇతరుల కోసం గాలిస్తున్నారు. నిందితులకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. రూ.8కోట్లు ఫ్రీజ్‌ చేశారు. దర్జాగా మోసాలు చేసి తప్పించుకు తిరుగుతున్న దంపతుల కోసం సైబరాబాద్‌ నేరవిభాగ డీసీపీ కల్మేశ్వర్‌ సింగ్నేవర్‌ ఆధ్వర్యంలో డీసీపీ దారా కవిత, ఏసీపీ గంగారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మినారాయణరెడ్డి బృందం మూడు రాష్ట్రాలు గాలించారు.

తెలంగాణ నుంచే రూ.70కోట్లు డిపాజిట్లు

జయంత్‌ బిశ్వాస్‌ స్వస్థలం కోల్‌కతా. డిప్లొమో అయ్యాక ఇంజినీరింగ్‌ చేశాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండేది. రూ.లక్ష పెట్టుబడితో మెటలాయిడ్స్‌ సస్టెనెన్స్‌ పేరుతో రాజస్థాన్‌లో అంకుర సంస్థ ప్రారంభించాడు. భాగస్వాములను చేర్చుకునేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. నిధుల సమీకరణ కష్టమైంది. పెట్టుబడి కోసం మెటలాయిడ్స్‌ సస్టెనెన్స్‌ పోర్ట్‌ఫోలియా(ఎంఎస్‌పీ)తో భార్యభర్తలిద్దరూ డైరెక్టర్లుగా కొత్త సంస్థ తెరిచారు. ఇదే ఆలోచన ఉన్నవారిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామంటూ ఆశచూపారు. అసోం, అండమాన్‌, విశాఖ, కోల్‌కతా, జైపూర్‌, హైదరాబాద్‌ తదితర ప్రధాన పట్టణాల్లో సమావేశాలు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా ఖాతాదారులను ఆకట్టుకుని ఖరీదైన హోటళ్లు, రెస్టారెంట్లలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హంగూ ఆర్భాటంతోపాటు.. విందు వినోదాలతో ఆకట్టుకున్నారు. సంస్థ పట్ల నమ్మకం ఏర్పడేలా చేశారు. 10-100శాతం వడ్డీలు ఇస్తామంటూ భారీఎత్తున డిపాజిట్లు సేకరించారు. 25-30 రోజుల్లోనే అధికరాబడి ఇస్తామంటూ ప్రకటనలతో ఊదరగొట్టారు. కొద్ది సమయంలోనే రూ.కోట్లు కూడబెట్టారు. ఒక్క తెలంగాణలోనే 3500 మంది నుంచి రూ.70కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించారు. కొద్దికాలం డిపాజిటర్లకు చెప్పినట్టుగానే అసలు, వడ్డీలు చెల్లించారు. డిపాజిటర్లు పెరిగే కొద్దీ తిరిగి చెల్లించటం కష్టంగా మారింది. దీంతో సంస్థ డైరెక్టర్లు బిచాణా ఎత్తేశారు. బాధితుల ఫిర్యాదుతో రాయదుర్గం, మాదాపూర్‌, రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

తెలివితో సంపాదించా.. తప్పెలా అవుతుంది

ఈఓడబ్ల్యూ, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల జాడ గుర్తించి బంజారాహిల్స్‌లోని ఖరీదైన హోటల్‌లో ఉన్న జయంత్‌ బిశ్వాస్‌ను గత నెల 31న అరెస్ట్‌ చేశారు. తప్పించుకున్న అతడి భార్య కోసం గాలిస్తున్నారు.నిందితుడు మాత్రం.. తాను తప్పుచేయలేదని వాదించడం కొసమెరుపు. తన తెలివితేటలు పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభిస్తే దాన్ని నేరమని ఎలా అంటారంటూ పోలీసులకు ఎదురు ప్రశ్నలు వేశాడు. తన ఆలోచనను ప్రధానమంత్రి, ఆర్ధికమంత్రికి తెలియజేసి అనుమతులు కూడా తీసుకోవాలనుకుంటున్నట్లు విచారణలో వెల్లడించాడని సమాచారం. కేసు ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అభినందించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details