తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2021, 7:34 AM IST

ETV Bharat / crime

GaddiAnnaram Market : గడ్డిఅన్నారం మార్కెట్​లో వసూళ్లు.. కార్యదర్శిపై వేటు

హైదరాబాద్‌ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో అవినీతి అభియోగాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపారులకు లైసెన్సుల జారీలో అక్రమాల ఆరోపణలతో మార్కెట్‌ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శిపై వేటు వేసింది. వసూళ్ల పర్వంపై మార్కెటింగ్ విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటంతో బాధ్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

gaddiannaram market, irregularities in gaddiannaram market
గడ్డిఅన్నారం మార్కెట్, గడ్డిఅన్నారం మార్కెట్​లో అక్రమాలు

హైదరాబాద్‌ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో ఏటా 500 కోట్ల రూపాయలకుపైగా పండ్ల క్రయ, విక్రయాలు జరుగుతాయి. రైతులు తెచ్చే పంట కొనడానికి ప్రతి వ్యాపారికీ తప్పనిసరిగా లైసెన్సు ఉండాలి. ఎవరైనా కొత్త లైసెన్స్ తీసుకుంటే దుకాణాలు పెట్టుకునేందుకు స్థలం కేటాయించాలి. ఎన్నో ఏళ్ల కిందట లైసెన్సులు తీసుకున్న వ్యాపారులకు ఇచ్చిన దుకాణాలతోనే నిండిపోవడంతో మార్కెట్‌లో జాగా లేదు.

గడ్డిఅన్నారం మార్కెట్​లో అక్రమాలు

రూ.8.8 కోట్ల లంచాలు

ఈ నేపథ్యంలో 30 లైసెన్సులు కొత్తగా ఇస్తుండగా... వీటిలో 16 వరకు పాలకమండలి సభ్యులకు ఇస్తానని ఆశ చూపించి ఛైర్మన్ నోళ్లు మూయించారు. సభ్యులకు తెలియకుండా లక్షల్లో డబ్బులు తీసుకుని ఏకంగా 176 లైసెన్సులు ఇచ్చినట్లు తేలడంతో అవాక్కయ్యారు. మొత్తం 176 లైసెన్సులు ఇవ్వడం కోసం ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయల చొప్పున 8.8 కోట్ల రూపాయలు లంచాల రూపేణా వసూలు చేసినట్లు వ్యాపార వర్గాలు ఆరోపించాయి.

వేటు పడింది

పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంపై ప్రభుత్వం స్పందించింది. అవినీతి, అక్రమాలకు బాధ్యుడైన వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని... ఆ ఉద్యోగం నుంచి తప్పించాలని నిర్ణయించింది. సెక్షన్ క్లర్క్‌ అస్లాంపైనా వేటేసింది. కొత్త లైసెన్సుల జారీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరమల్లు రామనర్సయ్య గౌడ్‌దే కీలక పాత్ర అని విచారణలో మార్కెటింగ్ శాఖ గుర్తించింది. ఆయన భరోసా ఇవ్వడం వల్లే నియమ నిబంధనలు పక్కన పెట్టి ప్రవీణ్‌ కుమార్‌.. పెద్ద ఎత్తున లైసెన్సుల జారీ చేసినట్లు తెలుస్తోంది.

అక్రమాలు వాస్తవమే..

లైసెన్సుల జారీ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఆ దస్త్రాలు బయటకు పొక్కకుండా ఛైర్మన్, కార్యదర్శి, కొందరు సిబ్బంది ఓ గదిలో పెట్టి తాళాలు వేసి విధులకు గైర్హాజరయ్యారు. విచారణ అధికారి, మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు వైజే పద్మహర్ష... ఆ గది తాళాలు పగులగొట్టించి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్సుల జారీలో భారీ అక్రమాలు వాస్తవమేనని నిర్ధారించారు. నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న పద్మహర్ష వెల్లడించారు.

అవినీతి భాగోతం

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో ఈ అవినీతి భాగోతం కొత్తదేం కాదు. గతంలో కేటాయించిన దుకాణాల్లో వ్యాపారాలు చేయని లైసెన్సుదారులు నామమాత్రపు మార్కెట్ ఫీజు చెల్లిస్తూ... అద్దెకు ఇచ్చుకుంటున్నారు. ప్రభుత్వానికి 4వేల రూపాయల అద్దె చెల్లిస్తున్న వీరు... మరొకరికి కిరాయికి ఇచ్చి 50 వేలకుపైగా ఆర్జిస్తున్నారు. మరికొందరైతే కేటాయించిన దుకాణ సముదాయాన్ని 40 నుంచి 60 లక్షలకు అమ్ముకున్న ఉదంతాలూ ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details