Gachibowli Accident : మద్యం సేవించి వాహనం నడపటమే గచ్చిబౌలి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రోహిత్, యూట్యూబర్ గాయత్రి, మరో నలుగురు కలిసి మద్యం సేవించారు. హోలీ సందర్భంగా మద్యం విక్రయించడంపై నిషేధం అమల్లో ఉంది. దీంతో రోహిత్, అతని స్నేహితులు కలిసి ఆన్ లైన్ ద్వారా రహస్యంగా మద్యాన్ని తెప్పించుకున్నారు. మద్యాన్ని కొబ్బరిబొండాలలో నింపుకొని కార్లలో దాచుకున్నారు.
డ్రైవింగ్ చేయొద్దని వారించినా..
మధ్యాహ్నం ప్రిజమ్ పబ్‌కు వెళ్లారు. పబ్ బయట కార్లలో కూర్చొని మద్యం సేవించి అనంతరం లోపటికి వెళ్లారు. హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం పబ్ నుంచి బయటికొచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రోహిత్‌ను కారు డ్రైవింగ్ చేయొద్దని స్నేహితులు వారించారు. డ్రైవర్‌ను అద్దెకు మాట్లాడుకొని కారులో వెళ్లాల్సిందిగా సూచించారు. అయినప్పటికీ వినకుండా తన గాయత్రితో కలిసి రోహిత్ కారులో బయల్దేరారు.
అపస్మారక స్థితిలో రోహిత్
వాళ్ల వెనకాలే మరో రెండు కార్లలో రోహిత్ స్నేహితులు ఫాలో అయ్యారు. విప్రో కూడలి వద్దకు రాగానే ఎల్లా హోటల్ వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అక్కడే చెట్లను నీళ్లు పడుతున్న ఎల్లా హోటల్ పనిమనిషి మల్లీశ్వరి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. వెనకాల కారులో వస్తున్న స్నేహితులు గమనించి గాయత్రి, రోహిత్ లను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. రోహిత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.