తెలంగాణ

telangana

ETV Bharat / crime

కరోనానూ వదలని కేటుగాళ్లు.. ఆగని సైబర్ మోసాలు - cyber criminals in telangana

రోజుకో తరహాలో మోసాలకు పాల్పడే సైబర్‌ కేటుగాళ్లు ‘కరోనా’ను వదల్లేదు. ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సాయం కావాలా..? మా తరఫున మీరు అవసరార్ధులకు సాయం చేస్తారా..? అంటూ ఆశ చూపి నిండా ముంచేస్తున్నారు. ఈ తరహా మోసాల బారిన పడుతున్న బాధితుల్లో ఎక్కువగా నిరుద్యోగులు, చిరుద్యోగులు, సామాజిక కార్యకర్తలే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు.

cyber crimes in the name of corona in telangana
కరోనానూ వదలని కేటుగాళ్లు

By

Published : Mar 25, 2021, 8:57 AM IST

  • సోనూసూద్‌ ఫౌండేషన్‌ తరఫున సాయం చేస్తామంటూ ఓ చిరుద్యోగి నుంచి సైబర్‌ మోసగాళ్లు రూ.60వేలు టోకరా వేశారు. మరో రూ.7,900 చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తుండటంతో అనుమానమోచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసి సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
  • కొత్తపేట్‌లోని ఓ ప్రైవేట్‌ వసతి గృహంలో ఉంటూ బాధితుడు(24) పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మేం పంపించే నిధుల్లో మీరు 40 శాతం ఉంచుకుని.. మిగిలిన 60 శాతం అవసరార్థులకు పంపిణీ చేయమంటూ బురిడీ కొట్టించి ఏకంగా రూ.11.17 లక్షలు కాజేశారు. రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోజుకో తరహాలో మోసాలకు పాల్పడే సైబర్‌ కేటుగాళ్లు ‘కరోనా’ను వదల్లేదు. ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సాయం కావాలా..? మా తరఫున మీరు అవసరార్ధులకు సాయం చేస్తారా..? అంటూ ఆశ చూపి నిండా ముంచేస్తున్నారు.

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా...?

మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారా..? అంటూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం తదితర సామాజిక మాధ్యమాల్లో సైబర్‌ కేటుగాళ్లు సందేశం (మెసేజ్‌) పంపిస్తున్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల పేర్లను వినియోగిస్తున్నారు. అదంతా నిజమేననుకుని అక్కడ పేర్కొన్న నంబర్లకు ఫోన్లు చేస్తున్నారు. హిందీలో అటువైపు నుంచి వ్యక్తులు మెల్లిగా ముగ్గులోకి దింపుతారు. రూ.10వేల వరకు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటూ సూచిస్తారు. మీ కంటే ముందు చాలా మంది ఉన్నారు. మీ ఆర్థిక పరిస్థితిని చూసి మీరు అడిగినదాని కంటే రెండు, మూడు రేట్లు ఎక్కువగా సాయం చేస్తామంటూ మరికొంత వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకుంటున్నారు.

నా తరఫున మీరు చేస్తారా..?

విదేశాల్లో వైద్యుడిగా, చర్చి ఫాదర్‌గా పనిచేస్తున్నానంటూ సందేశం పంపుతారు. మాటలు కలిపి వాట్సాప్‌ నంబర్‌ తీసుకుంటున్నారు. నాకు సేవ చేయాలని ఉన్నా సమయం లేదని, నా తరఫున మీరు చేయండి అంటూ వాట్సాప్‌లో ఆకర్షణీయ పార్సిల్‌, కొరియర్‌ రశీదు పంపుతారు. వాటిలో విలువైన వస్తువులు ఉన్నాయని నమ్మిస్తారు. కొన్ని రోజుల తర్వాత దిల్లీ విమానాశ్రయం నుంచి ఫోన్‌ వస్తుంది. మీ పేరిట గిఫ్ట్‌ బాక్స్‌ వచ్చింది.. క్లియరెన్స్‌, రిజిస్ట్రేషన్‌, జీఎస్టీ చెల్లించాలంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసేస్తున్నారు.

నైజీరియన్‌ ముఠాల పనే

నైజీరియన్‌ ముఠాలే ఈ మోసాలకు పాల్పడుతున్నాయని పోలీసులు నిర్ధారణకొచ్చారు. విజిటింగ్‌/బిజినెస్‌ వీసాలపై వచ్చి దిల్లీ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్నట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో బాధితులను గుర్తించి వల వేసే బాధ్యత నైజీరియన్లు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు, డబ్బు డ్రా లాంటి పనులను స్థానికులకు అప్పగిస్తారు. ఒక్కో లావాదేవీపై 15-20 శాతం కమిషన్‌ చెల్లిస్తారు. ఇటీవల రూ.4 కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లను పంపిస్తున్నానంటూ సఫిల్‌గూడకు చెందిన బాధితురాలికి రూ.29.74 లక్షలు టోకరా వేశారు. ఈ కేసులో నైజీరియాకు చెందిన చిబుకే క్రిస్టియన్‌ అర్రెగ్‌బునాం(32), సోనియా కమ్యూనికేషన్స్‌ నిర్వాహకుడు అరుణ్‌ కుమార్‌(28)ను రాచకొండ పోలీసులు దిల్లీలో అరెస్ట్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details