తెలంగాణ

telangana

ETV Bharat / city

మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు - తెరాస నేతను హతమార్చిన మావోలు

మన్యం ప్రాంతంలో వరుస ఘటనలు ఆదివాసీలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. మొన్న ఆసిఫాబాద్‌, నిన్న భద్రాద్రి కొత్తగూడెం, తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ల ఘటనలు మరువక ముందే.. ఆదివారం ఉదయం జరిగిన తెరాస నేత హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు.. అటవీ ప్రాంతాల్లో మరింత కూంబింగ్ నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు
మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు

By

Published : Oct 12, 2020, 5:33 AM IST

మావోయిస్టుల ఆగడాలకు కళ్లెం వేసేందుకు పటిష్ఠ చర్యలు

ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికిని పసిగట్టిన పోలీసులు వారిని అణిచివేసేందుకు పక్కా కార్యచరణతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసు బాస్‌ మహేందర్‌ రెడ్డి ఆసిఫాబాద్‌, ములుగు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మావోలపై పైచేయి సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో పోలీసులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతాల్లో యువతను రిక్రూట్‌ చేసుకుంటున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు మన్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు పలువురు సహచరులను కోల్పోయారు. ఆ ఘటనలకు ప్రతీకారంగా వెంకటాపూర్‌ మండలం బోదాపురంలో తెరాస నేతను మావోయిస్టులు హత్య చేశారు.

త్రిముఖ వ్యూహాం..

ఇటీవల వెంకటాపురం ఠాణాలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా.. ప్రత్యేక వ్యూహరచన కోసం కేంద్ర బలగాల అధికారులతో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నిఘా వ్యవస్థ పటిష్ఠం చేసి.. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో.. త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసి మావోయిస్టులను ఏరివేయాలని నిర్ణయించారు. సమావేశం జరిగిన వారం లోపే ఈ ఘటన జరగ్గా.. పక్కా వ్యూహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

రెక్కీ నిర్వహించినట్లు అనుమానం..

హత్యకు ముందు శనివారం నాడు ఆ ప్రాంతంలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. పశువులను కొనుగోలు చేస్తామంటూ.. మృతుడి ఇంటి పరిసరాల్లో తిరిగినట్లు తెలుస్తోంది. లక్ష్మయ్య వచ్చాడని భీమేశ్వరరావు భార్య చెప్పగ్గా.. లక్ష్మయ్య ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునితో అత్యంత సన్నిహితంగా ఉండేవారి సహకారంతో... హతమార్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

నిఘావర్గాలు ఆరా..

మావోయిస్టు ఏరియా కమిటీ పేరుతో వదిలివెళ్లిన లేఖలో.. కార్యదర్శి పేరును కొట్టివేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మావోలు పాల్గొన్నట్లు స్పష్టమైనా... ఇంకా ఎవరైనా ఉన్నారా? స్థానికంగా ఎవరెవరు వీరికి సహకరించారన్న దానిపై నిఘావర్గాలు ఆరా తీస్తున్నాయి. తెరాస నాయకుడిని హతమార్చడం.. తెరాస, భాజపా నాయకులు రాజీనామాలు చేయాలంటూ లేఖ ద్వారా హెచ్చరించిన నేపథ్యంలో.. పరిస్థితి చేయిదాటక ముందే మావోయిస్టుల ఆగడాలకు పూర్తిగా చెక్‌ పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు. మావోలకు సహకారం అందిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టడమే కాకుండా.. అటవీ ప్రాంతంలో మరింత కూంబింగ్‌ చేయాలని నిర్ణయించారు.

ఇవీ చూడండి:మావోల ఘాతుకం... తెరాస కార్యకర్త దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details