తెలంగాణ

telangana

ETV Bharat / city

త్రిముఖ పోరుతో హోరాహోరీగా పాలమూరు బరి

సిట్టింగ్​ని నిలుపుకొనేందుకు కారు... పట్టు సాధించేందుకు హస్తం... గెలుపుపై ధీమాతో కమలం... మహబూబ్​నగర్ పార్లమెంటు ​బరిలో దిగుతున్నాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా లోక్​సభకు మొదటిసారి పోటీ చేస్తున్నవారే. తాజా పరిణామాలతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది.

By

Published : Mar 25, 2019, 6:05 PM IST

జోరుగా పాలమూరు పార్లమెంటు పోరు

జోరుగా పాలమూరు పార్లమెంటు పోరు
మహబూబ్​నగర్ నుంచి గతంలో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎంపీ జితేందర్ రెడ్డి తెరాస పార్లమెంటరీ పక్షనేతగా వ్యవహరిస్తున్నారు. అంతటి కీలకమైన స్థానం నుంచి విజయ బావుటా ఎగురవేసేందుకు తెరాస, కాంగ్రెస్, భాజపా తహతహలాడుతున్నాయి. 1952 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు కాంగ్రెస్...తెరాస, జనతా పార్టీ చెరో 2 సార్లు, భాజపా ఒకసారి విజయం సాధించాయి. నియోజకవర్గ పరిధిలో 15 లక్షల ఓటర్లున్నారు. 2014లో తెరాస అభ్యర్థి జితేందర్ రెడ్డి 3 లక్షల 34 వేలు, కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డికి 3 లక్షల 31 వేలు, భాజపా నుంచి చేసిన నాగం జనార్దన్ రెడ్డికి 2 లక్షల 75వేలు పోలయ్యాయి.

పార్టీ బలమే ఆధారం

మహబూబ్​నగర్ పార్లమెంటు నియోజకవర్గం తెరాస సిట్టింగ్ స్థానం. జితేందర్ రెడ్డికే మరోసారి అభ్యర్థిత్వం దక్కుతుందని భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదంటూ...గులాబీబాస్​ జితేందర్​కు ఉద్వాసన పలికారు. అనూహ్యంగా... పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడం వల్ల గెలుపు బాధ్యత మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలకు అప్పగించారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం, స్థానికత కలిసొచ్చే అంశాలు. జితేందర్ రెడ్డి వర్గం సహకరిస్తామని ప్రకటించినా...అనుచరగణం అనుకూలంగా పనిచేస్తుందా అన్నది ప్రశ్నార్థకం.

వలసలతో కాంగ్రెస్ విలవిల

మహబూబ్​నగర్ నుంచి ఎక్కువ సార్లు గెలిచిన కాంగ్రెస్... ఈసారీ చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డిని బరిలో దింపింది. గత ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయారు. నేతలు పార్టీలు మారుతున్నా... క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్​ పార్టీతోనే ఉన్నందున విజయం సాధింస్తామనే విశ్వాసంతో వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. ఎమ్మెల్యేలు లేకపోవడం, సీనియర్లంతా పార్టీని వీడటం, అభ్యర్థి స్థానికేతరుడనే అభిప్రాయం ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.

సొంత ఇమేజ్​కు మోదీ తోడు

మహబూబ్​నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న భాజపా నాయకత్వం... ఇటివలె కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణను బరిలో దింపింది. జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు గెలవకపోయినా... కొన్ని సెగ్మెంట్లలో పార్టీకి బలం ఉంది. డీకే అరుణ చేరికతో కమలదళంలో నూతనోత్సహం కనిపిస్తోంది. పాలమూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమెకు నియోజకవర్గంపై పట్టుంది. భాజపా ఓటు బ్యాంకు, అభ్యర్థి బంధుగణం, అనుచరవర్గం, బలమైన మహిళా నేతగా ప్రజలకు సుపరిచితురాలు కావడం గెలుపునకు దోహదం చేస్తాయని పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. మోదీ ఇమేజ్ అదనపు ప్రచారాస్త్రంగా మారనుంది.

ఇవీ చూడండి:చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం

ABOUT THE AUTHOR

...view details