Double Bedrooms in Sircilla: చూస్తున్నారుగా... ఇదెక్కడో హైదరాబాద్‌లోని కార్పొరేట్ అపార్ట్‌మెంట్ కాదు... మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయం. 30 ఎకరాల్లో నిర్మించిన 1320 గృహాలను గత ఏడాది జులైలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులకు ఈ సముదాయంలో ఆరుగురికి అందజేశారు. ఏడాది గడుస్తున్నా... మిగతా ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వడం మాత్రం మరిచిపోయారు. 1320 ఇళ్లలో కేవలం పదిఇరవై మంది మాత్రమే లబ్ధిదారులు మాత్రమే ఇళ్లలోకి వచ్చారు. మిగతా వందలాది ఇళ్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
సిరిసిల్ల మున్సిపాలిటీలో 117కోట్ల71లక్షలతో 2వేల 52 ఇళ్లను నిర్మించారు.ఇందులో అర్హత సాధించిన లబ్ధిదారులు 2వేల 767 ఉండగా... లాటరీ పద్దతిన 1,804మందిని ఎంపిక చేశారు. మరో 968మంది మిగిలి ఉన్నారు. ఇళ్ల నిర్మాణం చేపట్టి కూడా ఏళ్లు గడుస్తుండగా... ఇప్పటికే చాలా చోట్ల శిథిలమయ్యే పరిస్థితి నెలకొంది. గదులు పలుచోట్ల నెర్రలు బారుతున్నాయి. కిటికీల అద్దాలు, తలుపులు విరిగిపోగా... నీటిట్యాంకుల మూతలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ గృహసముదాయం మందుబాబుబు మద్యం సేవించటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లు ప్రభుత్వం తీరుతో వృథాగా పడి ఉన్నాయని పలురాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.