YCP supports Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు వైకాపా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ద్రౌపదీ ముర్ము నామినేషన్ దాఖలు చేయనున్నందున ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు జగన్ సిద్ధమై ఆగిపోయారు. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో చర్చ జరిగింది. అందువల్ల శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడనుందని కూడా ప్రచారం సాగింది. రాత్రికి పరిణామాలు మారాయి. సీఎం దిల్లీకి వెళ్లడం లేదంటూ ఆయన కార్యాలయం నిర్ధారించింది.
'స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన వ్యక్తికి అందులోనూ మహిళకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామంగా వైకాపా భావిస్తోంది. అందువల్లే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ముకు మద్దతు తెలియజేస్తున్నాం. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయానికి దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా ద్రౌపదీ ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నాం. ముందుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్ణయించుకున్నందున రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి సీఎం హాజరు కావడం లేదు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి హాజరవుతారు'